గ్రేటర్ కొత్త మేయర్‌ అనుచరుడికి జీహెచ్ఎంసీ షాక్, జరిమానా విధింపు

గ్రేటర్ కొత్త మేయర్‌ అనుచరుడికి జీహెచ్ఎంసీ షాక్, జరిమానా విధింపు

ghmc officers give shock to greater mayor: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మేయర్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలను తొలగించి వేశారు. అంతేకాదు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు విజయలక్ష్మి అనుచరుడు, టీఆర్ఎస్ నేత అతీశ్ అగర్వాల్ కు రూ.15వేల జరిమానా విధించారు. మేయర్ ప్రమాణస్వీకారం కోసం శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటివరకు 3లక్షల 15వేల రూపాయల జరిమానా విధించారు.

ఫిబ్రవరి 11న గ్రేటర్ మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతీష్ అగర్వాల్.. నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అనధికారికంగా ఫ్లెక్సీలను ఎలా పెడతారంటూ కొందరు నగర పౌరులు ఫొటోలు తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ లో అలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మేయర్ విజయలక్ష్మి అనుచరుడు అతీష్ అగర్వాల్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. ఫ్లెక్సీలు తొలగించడమే కాకుండా ఆయనకు జరిమానా విధించి షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు. ఇక మిగతా ప్రాంతాల్లోనూ అనధికారిక ఫ్లెక్సీలు తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.