అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

  • Published By: bheemraj ,Published On : November 12, 2020 / 04:49 PM IST
అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

Woman suicide attempt : హైదరాబాద్ బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమంగా నిర్మిస్తున్న ఓ ఇంటిని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రాగా వారిని ఎంకమ్మ అనే హిళతోపాటు స్థానికులు అడ్డుకున్నారు. కూల్చివేతను ఆపాలంటూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంటి నిర్మాణాన్ని కూల్చివేస్తే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తానని అంటోంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.



అంబేద్కర్ నగర్ లో నివాసముండే మోహన్ రెడ్డి.. ఎంకమ్మ అక్రమంగా ఇంటిని నిర్మిస్తుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు మోహన్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి నానా రభస చేశారు. ఇంట్లోని పూల కుండీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.



అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసిన మోహన్ రెడ్డిపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ రెడ్డే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని స్థానికులతో చర్చించారు. పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.