పాక్‌ నుంచి ఇండియాకు వచ్చిన గీత : మా కూతురే అంటున్న రెండు ఫ్యామిలీలు…ఆమె ఎవరి కూతురు?

పాక్‌ నుంచి ఇండియాకు వచ్చిన గీత : మా కూతురే అంటున్న రెండు ఫ్యామిలీలు…ఆమె ఎవరి కూతురు?

Gita came to India from Pakistan : దివంగత కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ పాకిస్థాన్‌ నుంచి రప్పించిన గీత గుర్తుందా..? ఆమె తల్లిదండ్రుల విషయంలో రోజురోజుకు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయ్. ఆమె తమ కూతురంటే.. తమ కూతురు అంటూ.. అనేక మంది వరుస కడుతున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి, వరంగల్ జిల్లాల నుంచి రెండు ఫ్యామిలీలు గీతను అప్పగించాలని కోరుతున్నాయి. మరి వీరిలో గీత ఎవరి కూతురు?

20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పుట్టుకతో మూగ, చెవిటి. ఐదేళ్ల క్రితం అప్పటి విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ సహకారంతో ఇండియాకు వచ్చింది. అప్పటి నుంచి ఇండోర్‌లోని ఓ ఆశ్రమంలో ఉంటోంది. ఇప్పుడు కుటుంబీకుల జాడ కోసం వెతుకుతోంది. పది రోజుల క్రితం ఆమె బాసరకు వచ్చింది. తల్లిదండ్రుల కోసం సొసైటీ సహకారంతో సెర్చ్‌ చేస్తోంది. ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇందూరు-మధ్యప్రదేశ్ వారి సహకారంతో తన కుటుంబ సభ్యుల కోసం వెతుకుతోంది.

గీత తమ కూతురే అంటున్నారు మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని రాయినపట్నానికిచెందిన కోల యాకయ్య, శాంతమ్మ దంపతులు. గీత అసలు పేరు సౌజన్య అని… 2000 సంవత్సరంలో తమకు జన్మించిందని తెలిపారు. ఆమె చిన్నప్పటి నుంచి మాట్లాడేది కాదని…. సైగలు మాత్రమే చేసేదని గుర్తు చేసుకుంటున్నారు. గ్రామస్తులు సైతం టీవీలో చూపించిన ఫోటోలను చూసి.. ఆమె సౌజన్య అనే చెబుతున్నారు. యాకయ్య, శాంతమ్మకు దూరమైన కూతురునిని దగ్గరికి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

యాకయ్య దంపతులకు 2000 సంవత్సరంలో సౌజన్య అనే కూతురు జన్మించింది. వీరు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉండేవారు. ఒకరోజు రోజు దంపతులిద్దరూ పనికోసం వెళ్లగా… సాయంత్రం వచ్చే సరికి సౌజన్య కనిపించకుండా పోయింది. తెలిసిన చోటల్లా వెతికినా దొరకలేదు. దీంతో కొంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో యాకయ్య ఫిర్యాదు కూడా చేశారు. . తన కూతురు అదృశ్యానికి వెంకన్న అనే తాపీమేస్త్రీ అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కనిపించకుండా పోవడంతో తట్టుకోలేకపోయారు. నాటి నుంచి సౌజన్య దుస్తులను చూసుకుంటూ ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. సౌజన్య ముఖంపై కుడివైపున కంటి పక్కన, కుడి భుజంపైనా పుట్టుమచ్చలు ఉన్నట్టు చెబుతున్నారు. గీతను చూపిస్తే గుర్తు పడతామని యాకయ్య దంపతులు 10టీవీని ఆశ్రయించారు.

గీత తమ కూతురనేనని యాకయ్య, శాంతమ్మ దంపతులు చెబుతుంటే…. కాదు కాదు తమ కూతురంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు…. కాల్వశ్రీ రాంపూర్‌ మండలం తారుపల్లికి చెందిన బొల్లి స్వామి. 2001లో ఎనిదేళ్ల వయసులోనే గీత స్కూల్‌ నుంచి తప్పిపోయిందని ఆయన చెబుతున్నాడు. గీతకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి తమకు అప్పగించాలని కోరుతున్నాడు.

గీత కోసం రెండు ఫ్యామిలీలు ఎదురు చూస్తున్నాయి. మరి గీత ఇంతకూ ఎవరి కూతురు. ఆమె ఈ రెండు కుంటుంబాల్లో ఏ కుటుంబానికి చెందినది. ఈ అంశంపై తేల్చాల్సింది మాత్రం అధికారులే. మరి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.