బంగారం చోరీ కేసును చేధించిన పోలీసులు..మృతుల నుంచి 2.3 కిలోల బంగారాన్ని తస్కరించిన 108 సిబ్బంది

బంగారం చోరీ కేసును చేధించిన పోలీసులు..మృతుల నుంచి 2.3 కిలోల బంగారాన్ని తస్కరించిన 108 సిబ్బంది

Gold smuggling case in Peddapalli : పెద్దపల్లి జిల్లాలో బంగారం చోరీ కేసును పోలీసు చేధించారు. కారు ప్రమాదంలో బంగారు వ్యాపారులు మృతి చెందిన కేసులో.. బంగారం చోరీకి గురైనట్లు బంధువులు ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు…. మృతుల నుంచి సుమారు 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని 108 సిబ్బంది తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను తరలించిన 108 సిబ్బందిని విచారించిన పోలీసులు… వారి నుంచి 2 కేజీల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన ఇద్దరు వ్యాపారులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు మొత్తం 3 కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం 5 కిలోల 600 గ్రాముల బంగారం ఉండాలని మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో… అసలు దొంగలు దొరికారు.

ప్రమాదం జరిగిన తర్వాత బంగారం మిస్సింగ్ వ్యవహారం సర్వత్రా ఆసక్తి రేపింది. వ్యాపారులు తీసుకొస్తున్న గోల్డ్‌కు, పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్తున్న లెక్కలకు పొంతన లేదు. గోల్డ్‌ లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయి. పోలీసులు మొదట కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సాయంత్రం మొత్తం మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. కానీ బంగారు వ్యాపారుల కుటుంబ సభ్యుల ప్రకటనతో మరింత బంగారం చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.