గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, డెత్ రేట్.. భారీగా పెరిగిన రికవరీ రేటు

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 04:38 PM IST
గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, డెత్ రేట్.. భారీగా పెరిగిన రికవరీ రేటు

corona cases in telangana: డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు‌. అలాగే డెత్‌ రేట్ కూడా భారీగా తగ్గిందన్నారు. అదే సమయంలో రికవరీ రేటు భారీగా పెరిగిందన్నారు. సెప్టెంబర్ నెలలో అతి తక్కువగా పాజిటివ్ పర్సెంటేజ్ నమోదైనట్టు తెలిపారు. జూన్ లో 23శాతం పాజిటివ్ పర్సెంటేజ్ నమోదవగా, సెప్టెంబర్ లో 4శాతానికి పాజిటివ్ పర్సెంటేజ్ తగ్గిందన్నారు.

* తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
* రాష్ట్రంలో భారీగా పెరిగిన రికవరీ రేటు
* రాష్ట్రంలో భారీగా తగ్గిన డెత్ రేటు
* హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి
* కేసులు తగ్గినా జనం జాగ్రత్తగానే ఉండాలన్న డీహెచ్ శ్రీనివాస్
* కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో జనం భారీగా గుమిగూడటం సరికాదు

కొవిడ్ కేసులు తగ్గుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి:
కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్ శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి 10లక్షల మందిలో 79వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ కోఠిలోని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.

జూన్‌లో కరోనా పాజిటివ్‌ రేటు అత్యధికంగా 23 శాతం నమోదు కాగా.. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు 4శాతం మాత్రమే ఉందన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి కొవిడ్ కేసులు తగ్గుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రోజుకు సగటున 55వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు శ్రీనివాస్‌ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 15.42 శాతం మాత్రమే యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు.

కరోనా రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే తెలంగాణలోనే అధికం:
కరోనా రికవరీ రేటు జాతీయస్థాయి కంటే తెలంగాణలోనే అధికంగా ఉందని శ్రీనివాస్‌ చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.59 శాతం మాత్రమే ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 230 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 శాతం బెడ్స్ నిండాయని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం మంది పొరుగు రాష్ట్రాల వారు చికిత్స పొందుతున్నారని శ్రీనివాస్‌ వివరించారు. కరోనా సోకిన తర్వాత సైతం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.

మాదాపూర్‌, హైటెక్‌ సిటీలో కేసులు తగ్గుముఖం పట్టినా:
నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కేసుల సంఖ్య కొంత ఎక్కువగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాదాపూర్‌, హైటెక్‌ సిటీలో కేసులు తగ్గుముఖం పట్టినా జనజీవనం సాధారణ స్థితికి రాలేదని.. ఆయా సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించలేదని చెప్పారు. కొవిడ్‌కి ముందు తర్వాత అనేలా జనజీవనం ఉంటోందన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని శ్రీనివాస్‌ సూచించారు.

అన్ని ఆసుపత్రుల్లో తగినంత మంది డాక్టర్లు ఉన్నారు:
కొవిడ్‌ పరిస్థితులు తొలి నుంచీ అనుకున్న విధంగానే ఉన్నాయని డీఎంఈ రమేశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ పడకలకి ఆక్సిజన్‌ సరఫరా ఉందని చెప్పారు. మరో 12వేలకు పైగా బెడ్స్ కు ఆక్సిజన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో తగినంత మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారని రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఉంచామన్నారు.