‘ధరణి’ కష్టాలు.. రిజిస్ట్రేషన్లలో ప్రజలకు తప్పని తిప్పలు

‘ధరణి’ కష్టాలు.. రిజిస్ట్రేషన్లలో ప్రజలకు తప్పని తిప్పలు

Government focus on issues arising in Dharani portal : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణిలో భూముల రిజిస్ట్రేషన్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ధరణిలో చిక్కులు జనాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటికాదు.. రెండుకాదు… రకరకాల ఇబ్బందులు పెడుతోంది. సర్వర్‌ మొరాయింపులు, లాగిన్‌ సమస్యలు, ఈపాస్‌ బుక్‌ కనిపించకపోవడంలాంటి సమస్యలు రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారాయి. రెండు రోజులుగా ఇవే సమస్యలు అటు అధికారులను, ఇటు ప్రజలనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ధరణిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో…. కేబినెట్‌ సబ్‌ కమిటీ బీఆర్‌కే భవన్‌లో భేటీ అయ్యింది. సబ్‌ కమిటీ చైర్మన్‌ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌తోపాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టెక్నికల్‌ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

రేపు స్టేక్‌ హోల్డర్స్‌లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్‌ సబ్‌ కమిటీ. బాగా డిమాండ్‌ ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు.. తక్కువ రిజిస్ట్రేషన్‌ అయ్యే కార్యాలయాలుగా వర్గీకరించింది. సిబ్బందికి అవసరమైన చోటికి తాత్కాలిక బదలాయింపు చేసి.. రిజిస్ట్రేషన్లను వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది. పనిలేని దగ్గరి నుంచి పని బాగా ఉన్న రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లకు… సబ్‌ రిజిస్ట్రార్‌లను, ఆపరేటర్లను మార్చనున్నారు.

అధికారులను మూడు గ్రూప్స్‌గా విభజించారు. చట్టపరమైన ఇబ్బందుకు ఒక బృందాన్ని, సాంకేతిక సమస్యల కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేసింది కేబినెట్‌ సబ్‌ కమిటీ. ఇక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు మరో అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

భూముల క్రయ విక్రయాలు, దస్తావేజులు పారదర్శకంగా జరగాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సులభతరంగా అర్దమయ్యే రీతిలో ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ధరణి పోర్టల్‌ను సీఎం ప్రారంభించినట్టు గుర్తు చేశారు. ధరణి కోసం సీఎస్‌తోపాటు…. వందమంది అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.

రిజిస్ట్రేషన్ల సందర్భంగా తలెత్తుతున్న చిన్న చిన్న అవరోధాలను అధిగమిస్తూ ముందుకు పోతున్నామన్నారు. ధరణి కష్టాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించనున్నారు.