రసవత్తరంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు..

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్నాయి. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు సీరియ‌స్‌గా తీసుకున్నాయి. ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది.

రసవత్తరంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు..

Graduate MLC elections : తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్నాయి. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు సీరియ‌స్‌గా తీసుకున్నాయి. ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు సంధిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైద‌రాబాద్ స్థానానికి జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ కురుక్షేత్రాన్ని త‌ల‌పిస్తోంది. రికార్డు స్థాయిలో అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. సో .. ఎన్నిక‌ల్లో పార్టీల బ‌లాబ‌లాలేంటి..? పొలిటిక‌ల్ పార్టీలు అనుస‌రిస్తున్న వ్యూహాలేంటి..? మొత్తం మీద ఓట‌రు ఎవ‌రి వైపు మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయి.

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైద‌రాబాద్ ఒక స్థానం కాగా.. రెండోది వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్లగొండ‌. ఈ రెండు స్థానాల‌కు ఈ నెల 14న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే ఈసారి గ‌తంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. ఈ ఎన్నిక‌ల‌ను అన్ని రాజ‌కీయ పార్టీలు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాయి. ప్రచారాన్ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకొని నిత్యం జ‌నంతో మ‌మేక‌మవుతున్నాయి. మ‌రో వైపు ఇండిపెండెంట్లు కూడా అత్యధికంగా బ‌రిలో నిలిచారు. మొత్తంగా ఈ స్థానం నుంచి 93 మంది ఎన్నిక‌ల బ‌రిలో పోటీ ప‌డుతున్నారు.

తెలంగాణ‌కు గుండెకాయ లాంటి హైద‌రాబాద్ నాడి కూడా ఈ ఎన్నిక ద్వారా తెలిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రీ ముఖ్యంగా పొలిటిక‌ల్ పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. TRS నుంచి ఈసారి పీవీ న‌ర్సింహారావు కూతురు సుర‌భి వాణిశ్రీని బ‌రిలో నిలిచారు. BJP నుంచి సిట్టింగ్ MLC రామచంద్రరావు మరోసారి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. TDP తరపున ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ బరిలో ఉన్నారు. మాజీ MLC ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, మాజీ ఉపాధ్యాయుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి వంటి ఇండిపెండెంట్లు కూడా బరిలో నిలిచారు.

గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలో గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో అధికార TRS ఉంది. అందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేల‌‌కు బాధ్యత‌లు అప్పగించింది. దీంతో ఆయా మంత్రులు ఎక్కడిక్కడ స‌మావేశాలు పెట్టుకొని సీరియ‌స్‌గా ప్రచారం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్‌ను రంగంలోకి దింపినా చేదు ఫ‌లితం వ‌చ్చింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితిల్లోనూ గెల‌వాల‌ని TRS ప‌ట్టుద‌ల‌తో ఉంది. అలాగే ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా మాజీ మంత్రి చిన్నారెడ్డిని పోటీలో నిలపడం ద్వారా తామెంత సీరియస్‌గా తీసుకుంది స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేస్తున్న గాల్‌రెడ్డి హ‌ర్షవ‌ర్ధన్‌రెడ్డి వ‌ల్ల ఓటింగ్ చీలే అవ‌కాశం ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. హ‌ర్షవ‌ర్ధన్‌రెడ్డి గ‌తంలో టీచ‌ర్‌గా ప‌నిచేసిన అనుభవంతో గ‌త రెండేళ్లుగా గ్రాడ్యుయేట్లతో స‌మావేశాలు పెడుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇది తమను దెబ్బతీస్తుందేమోనని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

బీజేపీ నుంచి ఎన్‌.రామ‌చంద్రరావు మ‌రోసారి త‌న అద‌ృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సునాయాసంగా గెలుపొందిన రామ‌చంద్రరావు ఈ సారి కూడా విక్టరీ సాధించాల‌ని ఉవ్విల్లూరుతున్నారు. అందుకోసం పార్టీ యంత్రాగ‌మంతా రంగంలోకి దిగింది. అలాగే ఈసారి మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ కె.నాగేశ్వర్ మ‌రోసారి బ‌రిలో నిలిచారు. ఈ ఎమ్మెల్సీ స్థానం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు ట‌ర్మ్‌లు నాగేశ్వర్ ఇక్కడి నుంచి గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ దూరంగా ఉన్న నాగేశ్వర్.. ఈ సారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం కోసం ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచారు.

మొత్తం మీద ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల పోరు యావ‌త్ తెలంగాణ ద‌ృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఓవైపు పార్టీల అభ్యర్థులు, మరోవైపు గట్టి ఇండిపెండెంట్లు…మొత్తంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 5ల‌క్షల 31 వేల 268 మంది గ్రాడ్యుయేట్ ఓట‌ర్లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.