గ్రేటర్ ఓటర్ తిరగబడుతున్నాడు, నేతలను నిలదీస్తున్నాడు

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 06:48 AM IST
గ్రేటర్ ఓటర్ తిరగబడుతున్నాడు, నేతలను నిలదీస్తున్నాడు

Great people depressing leaders : గ్రేటర్‌ ఓటరు తిరగబడుతున్నాడు. ప్రచారం కోసం వచ్చిన నేతలను నిలదీస్తున్నాడు. ఇచ్చిన హామీలను విస్మరించిన నేతలను ప్రశ్నిస్తున్నాడు. తమ సమస్యలు తీర్చితేనే ఓట్లేస్తామని తెగేసి చెబుతున్నాడు. దీంతో నేతలు సొంత డబ్బులతోనైనా హామీలు అమలు చేస్తామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి.



పలు చోట్ల నిరసనలు : – 
టీఆర్‌ఎస్‌ ప్రచారంలో అన్ని పార్టీలకంటే ముందు వరుసలో ఉంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఓట్లడగటానికి వస్తోన్న నేతలకు ప్రజల నుంచి పలుచోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. ఎన్నికలప్పుడే దర్శనం ఇచ్చే నేతలను జనం నిలదీస్తున్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ నేతలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.



https://10tv.in/dissatisfaction-in-telangana-bjp/
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే : – 
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేరేడ్‌మెట్‌ డివిజన్‌లోని యాప్రాల్‌కు ప్రచారం కోసం వెళ్లారు. ఎన్నికల కోసం వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. జవహర్‌నగర్‌లో రోడ్డు వేయించాలని డిమాండ్‌ చేశారు. నో రోడ్స్‌.. నో ఓట్స్‌ అంటూ ప్లకార్డ్స్‌ ప్రదర్శిస్తూ 2 కిలోమీటర్ల మేర ర్యాలీ చేశారు. రోడ్డు సరిగా లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. తక్షణమే రోడ్లు వేయాలని డిమాండ్‌ చేశారు. రోడ్డుపై వెళ్లాలంటే నరకం చూస్తున్నామని.. ఓట్ల కోసం తప్ప ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజా ప్రతినిధులు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో వారంతా వాగ్వాదానికి దిగారు.



సొంత డబ్బు వేయిస్తానన్న ఎమ్మెల్యే : – 
స్థానికుల డిమాండ్‌పై స్పందించిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు… జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మాణం చేపడతామని హామీనిచ్చారు. ఒకవేళ నిధుల్లో జాప్యం ఏర్పడితే.. తన సొంత డబ్బుతో రోడ్డు వేయిస్తానని మాటిచ్చారు. ఈ మేరకు తన లెటర్ హెడ్‌పై సంతకం చేసి స్థానికులకు అందజేశారు.



అవసరం లేదన్న ప్రజలు : – 
స్థానికులు మాత్రం ఎమ్మెల్యే సొంత డబ్బులతో మాకు రోడ్డు అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి మేం ట్యాక్స్‌ కడుతున్నామని.. ప్రభుత్వ సొమ్ముతోనే రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అలాగేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే మైనంపల్లి.



పద్మారావు గౌడ్‌కు చేదు అనుభవం : – 
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని బౌద్ధనగర్‌ డివిజన్‌లో ఆదివారం పద్మారావు ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సమయంలో స్థానిక మహిళలు పద్మారావును నిలదీశారు. వరదలు వచ్చినప్పుడు రానివారు… ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తారా అని ప్రశ్నించారు. మొత్తానికి ఓటర్లు ఇదే సందర్భమంటూ నేతలను నిలదీస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని పట్టుబడుతున్నారు. దీంతో నేతలు ఓటరు డిమాండ్స్‌ను తీర్చుతామంటూ హామీలు గుప్పిస్తున్నారు.