గ్రేటర్ టార్గెట్ 100

  • Published By: madhu ,Published On : November 13, 2020 / 07:12 AM IST
గ్రేటర్ టార్గెట్ 100

Greater Target 100 : త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎఫెక్ట్ ఏమీ ఉందని స్పష్టం చేశారు. విపక్ష పార్టీ నేతల ప్రచారానికి ధీటుగా స్పందించి.. గ్రేటర్‌లో వంద స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించే దిశగా నేతలు పనిచేయాలని సూచించారు. ప్రగతి భవన్‌లో మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమైన కేసీఆర్.. దుబ్బాక ఫలితాలు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు.



వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు :-
గ్రేటర్ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మూడు కార్పొరేషన్లలో విజయం సాధించడం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఇద్దరు మంత్రులను ఇన్చార్జిలుగా నియమించారని.. మిగిలిన మంత్రులందరికీ గ్రేటర్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల అనంతరం పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు కూడా వస్తుండడంతో వాటిని కూడా సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులకు, పార్టీ నేతలకు సూచించారు.




బీజేపీ విషయంలో ఆందోళన వద్దు :-

బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికి సానుభూతి కలిసొచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. అయినా బీజేపీని చూసి పెద్దగా హైరానా పడొద్దని నేతలకు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతల అబద్ధాలను మాత్రం ఎక్కడికక్కడ ఎండగట్టాలని నేతలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో సమావేశం జరుగుతున్న సమయంలోనే ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్‌లో ఎంఐఎంతో కలిసి పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో లాగే ఈసారి కూడా అవే ఫలితాలు సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.