పటాన్‌చెరు కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు, అధిష్టానం మేలుకోకుంటే మనుగడ కష్టమే

  • Published By: naveen ,Published On : October 24, 2020 / 03:59 PM IST
పటాన్‌చెరు కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు, అధిష్టానం మేలుకోకుంటే మనుగడ కష్టమే

patancheru congress: పటానుచెరు…. మినీ ఇండియాను తలపించే నియోజకవర్గం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం ఈ ప్రాంత పారిశ్రామికవాడలకు వచ్చి స్థిరపడిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం పూర్తి వైవిధ్యంతో ఉంటుంది. ఇక్కడి ఓటర్ల మైండ్ సెట్ కూడా అంత తేలిగ్గా అర్థం కాదంటారు. ఇలాంటి నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ గెలిచింది.

ఎమ్మెల్యే మహిపాల్ ను ఎదుర్కోవడం కాంగ్రెస్ కు కష్టమే:
ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కార్మిక నాయకునిగా, మాస్ లీడర్‌గా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ ఆయన్ను తట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ తన సత్తాను నిరూపించుకోవాలంటే అంత ఈజీ కాదనే అంటున్నారు. కలసి సాగితేనే క్లిష్టమైన పరిస్థితి ఉండగా.. అలాంటిది కాంగ్రెస్‌ పార్టీలో మూడు గ్రూపులేర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గాలి అనిల్ కుమార్, పటానుచెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కాటా శ్రీనివాస్‌గౌడ్ వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఒకే చోట కలిసే పరిస్థితి లేదని అంటున్నారు.

సీనియర్లను పట్టించుకోని శ్రీనివాస్ గౌడ్:
ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీలోనే టాక్‌. సీనియర్లను కలుపుకొని వెళ్లకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారంటూ స్వపక్షీయులే విమర్శిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపులకు ఎవరి గ్రూపుతో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏదో కానిచ్చేశాం అనేలా చేపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి వ్యవహారం నచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి స్పెషల్‌ గ్రూప్‌ పెట్టేశారట. తన రూటే సెపరేట్ అంటూ తనకిష్టమొచ్చిన రీతిలో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.

అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నాయకుడు లేడు:
ఈ గ్రూపుల కారణంగా కొందరు సీనియర్లు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే నాయకత్వమే లేకుండా పోయిందని టాక్‌. ఈ కారణంగానే పార్టీ రెండు సార్లు ఓటమి పాలైందని భావిస్తున్నారు.

ఇలా అయితే కాంగ్రెస్ మనుగడ కష్టమే:
పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని గ్రూపు రాజకీయాలు లేకుండా చేస్తే పార్టీకి మనుగడ ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్లు అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఢీకొట్టాలంటే కాంగ్రెస్‌లో ఐక్యత అవసరమని సూచిస్తున్నారు. కానీ, అలా సీనియర్ల సూచనలు పట్టించుకుంటే అది కాంగ్రెస్‌ పార్టీ ఎందుకవుతుందని జనాలు అంటున్నారు. పార్టీలోని గ్రూపు వ్యవహారాలు రాష్ట్ర పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందట. అయితే దుబ్బాక ఉప ఎన్నికల పనిలో బిజీలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. అక్కడ ఎన్నిక పూర్తయ్యాక పటానుచెరు వ్యవహారాన్ని సెటిల్‌ చేస్తారని అంటున్నారు. పీసీసీ కలుగజేసుకున్న తర్వాత అయినా ఇక్కడి నాయకులు ఒక్కటై పని చేస్తారో లేదో?