Telangana Politics : మహబూబాబాద్ పార్లమెంట్ పాలిటిక్స్ ..గులాబీ గూటిలో గ్రూప్ వార్,కమిట్ అయ్యేందుకు సిద్ధమవుతున్న కమల దళం
మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయ్. ఇక్కడ అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య ఒక్కటే.. అదే గ్రూప్ వార్. బీఆర్ఎస్‌లో ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శిస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తుంటే.. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్ ! గ్రూప్ విభేదాలు అసంతృప్తులుగా మారితే.. వాళ్లను తమ వైపు లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

Telangana Politics : మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయ్. ఇక్కడ అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య ఒక్కటే.. అదే గ్రూప్ వార్. బీఆర్ఎస్‌లో ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శిస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తుంటే.. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్ ! గ్రూప్ విభేదాలు అసంతృప్తులుగా మారితే.. వాళ్లను తమ వైపు లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది. మహబూబాబాద్ పార్లమెంట్ రాజకీయంలో కనిపిస్తున్న మహా యుద్ధం ఏంటి.. ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సీన్ ఎలా ఉంది.. మహబాబాబాద్‌పై కాంగ్రెస్ మళ్లీ పట్టు సాధిస్తుందా.. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీలోనూ కారు జోరు చూపిస్తుందా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ ఏంటి.. కమలం పార్టీ పెట్టుకున్న ఆశలేంటి.. మహబూబాబాద్ రాజకీయ ముఖచిత్రమ్ ఎలా ఉంది..
మహబూబాబాద్ పార్లమెంట్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన మహబూబాబాద్‌లో.. ఇప్పుడు కారు జోరుకు బ్రేకుల్లేకుండాయ్ పోయాయ్. ఐతే ఈసారి అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలను రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతాయన్న చర్చ జరుగుతోంది. మాలోతు కవిత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014లో గెలిచిన సీతారాం నాయక్‌ను పక్కనపెట్టి 2019లో కవితకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య విభేదాలు కనిపించాయ్. ఎంపీ పదవితో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా కవిత దూసుకుపోతుంటే.. సీతారాం నాయక్ సైలెంట్ అయ్యారు. పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కొందరితో మంచి సంబంధాలే ఉన్నా.. మరికొందరితో ఎంపీకి గ్యాప్ ఉంది. ఇక ఎంపీ వదిలి అసెంబ్లీకి పోటీ చేయాలని కవిత ప్రయత్నాలు చేస్తుండడంతో.. అదే జరిగితే మహబూబాబాద్ బరిలో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
తండ్రి రెడ్యానాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోర్నకల్ నుంచి కవిత అసెంబ్లీ బరిలో నిలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఐతే కవిత సోదరుడు రవిచంద్ర పోటీ పడుతుండడంతో.. మహబూబాబాద్ లేదా ములుగు నుంచి పోటీ చేయాలని కవిత అనుకుంటున్నారు. ఆమె అసెంబ్లీ బరిలో దిగితే.. తండ్రి, సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ బీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ పార్లమెంటు బరిలో దిగే చాన్స్ ఉంది. మరోవైపు సీతారాం నాయక్ కూడా మరో చాన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మళ్లీ పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. డోర్నకల్ , మహబూబాబాద్ అసెంబ్లీ పరిధిలో వర్గపోరు బలరాంనాయక్‌కు ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది. మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డికి, బలరాంనాయక్‌కు మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయ్. బీజేపీ నుంచి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఉస్సేన్ నాయక్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఐదింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్‌తో పాటు డోర్నకల్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నాయ్. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. పార్టీలు ఏవైనా పెద్ది సుదర్శన్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి మధ్యే ప్రధాన పోటీ కనిపించనుంది. బీఆర్ఎస్ నుంచి సుదర్శన్ రెడ్డి మళ్లీ పోటీకి సిద్ధం అవుతుండగా.. వామపక్షాల మద్దతు ఆయనకు కలిసి వచ్చే చాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి పోటీ చేస్తారా లేదా అనేది కన్ఫ్యూజన్‌గా మారింది. ఆర్థికంగా మద్దతు ఇస్తే తప్ప పోటీ చేసే అవకాశం లేదని ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మాధవరెడ్డిపై బీజేపీ ఫోకస్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఆయనతో పాటు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌కు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే విషయం. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కత్తి వెంకటస్వామి కూడా బీసీ నినాదం తీసుకొచ్చి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఖాయం అనే ధీమాతో ఉన్నారు రేవూరి ప్రకాశ్ రెడ్డి. నర్సంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బిజేపీ బలహీనంగా ఉంది. దీంతో దొంతి మాధవరెడ్డిని కమలం పార్టీ టార్గెట్ చేసింది. అంతా సెట్ అయితే.. నర్సంపేట నుంచి మాధవరెడ్డిని పోటీకి దించితే.. రేవూరిని వరంగల్ వెస్ట్ నుంచి బరిలో దింపితే ఎలా ఉంటుందని బీజేపీ ఆలోచిస్తోంది. గరికపాటి మోహన్ రావు నేతను కూడా నర్సంపేటలో బరిలో దింపితే ఎలా ఉంటుందని కమలం పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు టాక్.
మహబూబాబాద్ అసెంబ్లీలో శంకర్‌నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఈ స్థానం నుంచి పోటీ భారీగా కనిపిస్తోంది. అన్ని పార్టీలను గ్రూపుల గోల వేధిస్తోంది. శంకర్ నాయక్‌కు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి కవితకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయ్. ప్రతీ మండలంలో శంకర్ నాయక్‌కు ప్రత్యర్థి వర్గం తయారయింది. ఐతే క్షేత్రస్థాయి కార్యకర్తలు, జనాలతో శంకర్ నాయక్‌కు మంచి సంబంధాలు ఉండడం ప్లస్ కానుంది. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ గెలిచిన కవిత.. ఈసారి కారు పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీ వెళ్లాలని అనుకుంటున్నారు. శంకర్‌నాయక్ వివాదాస్పద వైఖరి, జనాల్లో వ్యతిరేకత కలిసి వస్తుందని.. టికెట్ తనకే వస్తుందనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. బెల్లయ్య నాయక్, మురళీ నాయక్‌లాంటి నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఉస్సేన్ నాయక్ మరోసారి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ నేత యాప సీతయ్య కూడా కమలం పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తిగా తనకు ఛాన్స్ ఉంటుందని ఆయన భరోసా మీద కనిపిస్తున్నారు.
ములుగులో సీతక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మళ్లీ సీతక్కనే బరిలోకి దిగనున్నారు. ఈ నియోజకవర్గంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిసారించింది. ములుగును జిల్లా కేంద్రం చేయడంతో పాటు… కరకట్టకు, మేడారం జాతరకు భారీగా నిధుల కేటాయింపులాంటి చర్యలతో ములుగుపై పట్టు పెరిగిందని కారు పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. సీతక్కకు దీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లో ఒకరిని ఇక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి చందులాల్ కుమారుడు ప్రహ్లాద్, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ బడే నాగ జ్యోతి, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్ పేర్లు కూడా టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్. మేడారం పూజారుల సంఘం నేత జగ్గారావు బరిలో దించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. సీనియర్ నేతలు బంజారా కృష్ణవేణి నాయక్, గిరిజన మోర్చా నేతలు తాటి కృష్ణ, భూక్యా రాజునాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కపోతే సీతారాం నాయక్ కారు దిగుతారని ప్రచారం జరగుతున్న వేళ.. కాషాయం పార్టీలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయ్.
డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నేతల వరకు.. రెడ్యాకు మంచి సంబంధాలు ఉన్నాయ్. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థిగా ఉన్న రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్.. ఇప్పుడు ఒకేపార్టీలో ఉన్నారు. దీంతో డోర్నకల్‌లో వర్గవిభేదాలు పీక్స్‌కు చేరాయ్. రెడ్యానాయక్ పోటీకి దూరంగా ఉంటే.. ఎంపీ కవితతో పాటు
రెడ్యా నాయక్ కుమారుడు రవిచంద్ర పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సత్యవతి రాథోడ్ కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన రామచంద్రు నాయక్‌తో పాటు నెహ్రూ నాయక్ టికెట్ రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి గుగులోత్ లక్ష్మణ్ నాయక్, బానోత్ బాలకిషన్ నాయక్, గుగులోత్ దేవిక టికెట్ ఆశిస్తున్నారు. ఈ మధ్యే బీఆర్ఎస్‌ను వీడిన మాజీ ఐఏఎస్ రాంచంద్రు నాయక్‌పై బీజేపీ గురి పెట్టింది.
పినపాకలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావు.. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత కారెక్కారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లుతో రేగాకు ఆధిపత్య అధిపత్య పోరు నడుస్తోంది. సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్ అన్న కేసీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ నుంచి రేగా కాంతారావు పోటీ ఖాయంగా కనిపిస్తుండగా.. పాయం వెంకటేశ్వర్లు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ఐతే పినపాకలో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగానే ఉంది. దీంతో టికెట్ కోసం హస్తం పార్టీలో భారీ పోటీ కనిపిస్తోంది. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో… గ్రూప్‌లు పెరిగి యుద్ధాలకు కారణం అవుతోంది. పోదెం వీరయ్య గ్రూప్, బట్టా విజయగాంధీ గ్రూప్, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి అనుచరుడు డాక్టర్ శంకర్ నాయక్ గ్రూప్… ఇలా కాంగ్రెస్ మూడు గ్రూప్‌లుగా విడిపోయింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా.. ఇక్కడి నుంచి తన కుమారుడిని పోటీ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్రూప్‌లన్నీ ఏకం అయితే.. కాంగ్రెస్‌కు మంచి ఫలితం రావడం ఖాయం. బీజేపీకి పినపాకలో సరైన అభ్యర్థి దొరకడం లేదు.
ఇల్లందులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బానోత్ హరిప్రియ నాయక్.. కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కారు పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన కోరం కనకయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేసింది బీఆర్ఎస్. దీంతో హరిప్రియ నాయక్, కనకయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరింది. మాజీ ఎంపీ పొంగులేటి వర్గంలో చేరిన కోరం కనకయ్య తిరుగుబావుట ఎగురవేశారు. సిట్టింగ్‌లకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించినా.. ఇద్దరి మధ్య గ్రూప్ తగాదాలు ఏ పరిస్థితి దారి తీస్తాయన్న ఆసక్తి కనిపిస్తోంది. ఈ ఇద్దరితో పాటు సంజీవ్ నాయక్ కూడా గులాబీ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి భారీ పోటీ కనిపిస్తోంది. టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్‌తో పాటు చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రామచంద్రనాయక్, డాక్టర్ రవి నాయక్, డాక్టర్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ బలరాం నాయక్ కుమారుడు సాయిరాం నాయక్, ధన్‌సింగ్ నాయక్, ఎన్‌ఆర్‌ఐ మోకాళ్ల శ్రీనివాస్, కాశీరాం నాయక్‌లు టికెట్ రేసులో ఉన్నారు. బీజేపీకి ఇక్కడ సరైన బలంలేదు. మోకాళ్ల నాగ స్రవంతి, భాస్కర్ నాయక్, రామచంద్రు నాయక్ టికెట్ ఆశిస్తున్నా.. పెద్దగా మాస్ ఫాలోయింగ్ లేకపోవడం వీళ్లకు మైనస్.
భద్రాచంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పొదెం వీరయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ములుగు జిల్లాకు చెందిన వీరయ్య… గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి క్షణంలో భద్రాచలం అభ్యర్థిగా ప్రత్యక్షమై విజయకేతనం ఎగురవేశారు. మరి ఈసారి ఆయన మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. భద్రాచలం అంటే వామపక్షాలకు మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. కమ్యూనిస్టులు ఈ ప్రాంతం మీద ఆశలు పెంచుకున్నారు. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి బరిలో దిగిన మిడియం బాబురావు మల్లీ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పొత్తుల్లో భాగంగా.. బీఆర్ఎస్ ఈ స్థానాన్ని వామపక్షాలకు వదులుకునే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తెల్లం వెంకట్రావు.. ఈసారి కూడా ఆశలు పెంచుకున్నా.. వామపక్లాకు టికెట్ కేటాయిస్తే. ఈయనకు భంగపాటు తప్పదు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కుంజా సత్యవతి.. మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నర్సంపేట మినహా.. మిగిలిన ఆరు నియోజకవర్గాలు ఎస్టీరిజర్వ్‌డ్. ప్రతీ నియోజకవర్గంలోనూ రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీల మధ్య పోరు.. పార్టీలో పోరుతో.. రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మళ్లీ పట్టు సాధించాలని కాంగ్రెస్ పావులు కదుపుతుంటే.. మహబూబాబాద్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి ఆ సౌండ్ ఢిల్లీకి వినిపించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇక బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మీదే ఆశలు పెంచుకుంది. అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఏమైనా ముందుగా అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో.. ఆ ఫలితాల ఆధారంగా పార్లమెంట్ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.