హఫీజ్ పేట వివాదాలకు అడ్డా, భూ మాఫియా సత్తా

హఫీజ్ పేట వివాదాలకు అడ్డా, భూ మాఫియా సత్తా

land

Hafeezpet Land Issue : వంద కాదు.. రెండొందలు కాదు.. ఏకంగా రెండు వేల ఎకరాలు సివిల్‌ దావా వివాదాల్లో నలుగుతున్నాయి. భూముల ధరలకు రెక్కలొచ్చేసరికి ఆయా కాలాల్లో రాజకీయ, ఇతర అండదండలున్న వాళ్లు ఆ భూములను దక్కించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేస్తున్నారు. అవి వివాదాలకు, ఒక్కోసారి కిడ్నాపులు, హత్యలకూ కారణమవుతున్నాయి. తాజాగా జరిగిన మాజీ మంత్రి అఖిలప్రియ వివాదం కూడా అలాంటిదే. ఒకవైపు న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున క్రయవిక్రయాలు కొనసాగుతుండటం ఇక్కడ ప్రత్యేకం.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో : –
రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సుమారు రెండు వేల ఎకరాలపై న్యాయస్థానాల్లో… సీఎస్‌ 14/58 పేరిట సివిల్‌ వివాదాలు నడుస్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని హఫీజ్‌పేట సర్వే నెంబర్ 77-80, హైదర్‌నగర్‌ సర్వే నెంబర్ 145, 163, 172, హస్మత్‌పేట 1, 7, 15, 57, ఘన్‌సిమియాగూడ 3, 4 సర్వే నంబర్లలో సీఎస్‌14 వివాదాలు కొనసాగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఆ భూముల విలువ లక్ష కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. రెవెన్యూ దస్త్రాల ప్రకారం ఇవి జాగీర్‌ భూములుగా ఉన్నప్పటికీ, ఏళ్ల తరబడి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. అవి చేతులు మారుతుండగా, ఆక్రమణదారులు పెద్దఎత్తున లాభపడుతూ వస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయన్న సాకుతో అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా కొందరు రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దల సహకారంతో మ్యుటేషన్లు చేసుకుంటూ క్రయవిక్రయాలు చేపడుతున్నారు.

హఫీజ్ పేట్ భూ వివాదాలు : –
హఫీజ్‌పేట్‌ ప్రాంతంలో భూ వివాదాలు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. 1958లో ఆస్తుల పంపకాల విషయంలో నిజాం వారసుల మధ్య వివాదం మొదలైంది. హఫీజ్‌పేట భూములపై సీఎస్‌ 14/58 పేరిట సిటీ సివిల్‌ కోర్టులో వ్యాజ్యం మొదలైంది. ఆయా భూములు జాగీర్‌ లేదా పైగా అని ఉండటం, ప్రభుత్వం కూడా భాగస్వామిగా చేరడంతో సిటీ సివిల్‌ కోర్టు ఈ వ్యాజ్యాన్ని హైకోర్టుకు బదలాయించింది. 1963లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. సదరు భూములు ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టు బెంచ్‌లో అప్పీలు దాఖలు చేసింది. పదమూడేళ్ల విచారణ తర్వాత కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు రావడంతో 1977-80 మధ్య కాలంలో ప్రభుత్వం ఆ భూములను ఆయా ప్రైవేటు కుటుంబాలకు అప్పగించింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు : –
హైకోర్టు తీర్పును అమలు చేసినప్పటికీ విలువైన భూమిని వదులుకునేందుకు అప్పటి ప్రభుత్వం విముఖత చూపింది. 1983లో మరోసారి భూములపై రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుదీర్ఘంగా విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2002లో కేసును కొట్టేసింది. తీర్పునకు అనుగుణంగా ఆయా భూములను ఆర్‌వోఆర్‌, యూఎల్‌సీ చట్టాలకు లోబడి సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని 2004 నవంబరు 5న రంగారెడ్డి కలెక్టర్‌కు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం పెద్దఎత్తున మ్యుటేషన్లు జరిగాయి.

భూ మాఫియా సత్తా : –
సుప్రీం కోర్టు తీర్పు, సీఎస్ ఉత్తర్వుల నేపథ్యంలో భూ మాఫియా మరోసారి తమ సత్తా చూపింది. భూమి సొంతం చేసుకునేందుకు అధికారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చింది. ఆ కాలంలో రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన అధికారి ఒకరు ఈ భూముల్లో అక్రమ మ్యూటేషన్లు జరుగుతున్నట్టు గుర్తించి రద్దుచేశారు. ఈ భూములను కాపాడాలనే ప్రయత్నం చేసినప్పటికీ, భూ మాఫియా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయన్ని అక్కణుంచి బదిలీ చేయించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అటు తర్వాత 2009లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఏడాది విచారణ తర్వాత 2010 సెప్టెంబరులో ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల అనంతరం ఆ ఆదేశాలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పక్కన పెట్టింది. అప్పట్నుంచి కొందరు పలుకుబడి ఉపయోగించి మ్యుటేషన్లు చేయించుకోగా, మరికొందరు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇవన్నీ వివాదాలకు కారణమై హత్యలకు, అపహరణలకు దారితీస్తున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కలెక్టర్ బదిలీ : –
హైదరాబాద్‌ చుట్టూ విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూములు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రాబల్యం, అధికారుల అండదండలు సహా కండబలం ఉన్న వాళ్లంతా వాళ్లవాళ్ల స్థాయిలో భూముల చుట్టూ కంచెలు వేసి కబ్జా చేస్తూ వస్తున్నారు. తొమ్మిదేళ్ల కిందట అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని భూములపై సర్వే చేపట్టారు. ఇందులో వివిధ కేటగిరీల్లోని ప్రభుత్వానికి చెందిన 10 వేల 290 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నట్టు తేలింది. వాటిల్లో ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న స్థలాలను రక్షించేలా ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆ తర్వాత ఆయన బదిలీ కావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.