University Of Hyderabad : మిస్టరీగా మారిన మౌనిక మృతి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య మిస్టరీగా మారింది. బెడ్‌ షీట్‌తో కిటికీకి ఉరేసుకోవడం.. సూసైడ్‌ నోట్‌లో ఆత్మహత్యకు కారణాలు రాయకపోవడంపై అనుమానాలు.

University Of Hyderabad : మిస్టరీగా మారిన మౌనిక మృతి

University Of Hyderabad

University Of Hyderabad : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య మిస్టరీగా మారింది. బెడ్‌ షీట్‌తో కిటికీకి ఉరేసుకోవడం.. సూసైడ్‌ నోట్‌లో ఆత్మహత్యకు కారణాలు రాయకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. చూడటానికి ఆత్మహత్యలా కనిపిస్తున్నా… అసలు కారణాలు ఏంటన్న దానిపై స్పష్టత లేదు. దీంతో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మౌనిక మృతి కేసులో అనుమానాలు రేకెత్తిస్తోన్న వాటిపై పోలీసులు దృష్టి సారించారు. ఒకవేళ నిజంగానే మౌనిక ఆత్మహత్య చేసుకుంటే.. దానికి గల కారణాలను సూసైడ్‌ నోట్‌లో ఎందుకు రాయలేదన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మౌనిక చివరిసారిగా ఎవరితో కాల్ మాట్లాడిందనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. హాస్టల్ సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కూతురు మౌనిక. హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంటెక్‌ చేస్తోంది. నానో టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్న మౌనిక.. క్యాంపస్‌లోనే విమెన్స్‌ హాస్టల్-7లో ఉంటోంది. రోజూ అందరి కంటే ముందే వచ్చే ఆమె రాకపోవడంతో… తోటి విద్యార్థులు వెళ్లి పిలిచారు. రూమ్‌లో నుంచి స్పందన లేకపోవడంతో… కంగారుపడ్డ తోటి విద్యార్థినులు వెంటిలేటర్‌లోంచి చూశారు. కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించిందీ మౌనిక.

మౌనిక ఆత్మహత్య ఇతర విద్యార్థులందర్నీ తీవ్ర విషాదంలో ముంచేసింది. సూసైడ్ నోట్‌గా భావిస్తున్న ఓ పేపర్‌లో ఆమె రాసిన అక్షరాలు అందర్నీ కలచివేస్తున్నాయి. ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. మిస్‌ యూ నాన్న.. అమ్మ అని రాసినట్లు ఉంది. అయితే ఇది సూసైడే లేఖేనా … ఎవరైనా క్రియేట్ చేశారా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు.

కరోనా వ్యాప్తి తగ్గడంతో… ఎంటెక్‌ విద్యార్థులను క్యాంపస్‌లోకి ఈ మధ్యే అనుమతించారు. ఈనెల 18న హాస్టల్‌ గదికి వచ్చి ఉంటోంది మౌనిక. ఆమె తండ్రి లచ్చయ్య ఊళ్లో వ్యవసాయం చేస్తున్నారు. పదో తరగతి వరకు ఊళ్లోని గవర్నమెంట్ స్కూల్లో చదివిన మౌనిక… ఆ తర్వాత బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు సంపాదించింది.

అక్కడ ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్‌ చదువుతోంది. ఇతరులకు ధైర్యం చెప్పే తమ కూతురు.. ఆత్మహత్య చేసుకుందంటే ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు మౌనిక తండ్రి లచ్చయ్య. క్యాంపస్‌లోనే ఏదో జరిగిందని తండ్రి లచ్చయ్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మౌనిక మృతి దారి తీసిన పరిస్థితులు తెలిస్తే తప్ప ఇది ఆత్మహత్యా కాదా అన్నది తేలేలా కనిపించడం లేదు.