ఆదిలాబాద్‌‌లో చలి పంజా.. ఏజెన్సీ గజగజ

ఆదిలాబాద్‌‌లో చలి పంజా.. ఏజెన్సీ గజగజ

Heavy Cold Waves in Adilabad Agency : చలి పంజాకు ఆదిలాబాద్‌ ఏజెన్సీ గజగజ వణికిపోతోంది. ఉమ్మడి జిల్లాలో ఐదు రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. పొగమంచు కమ్మేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు… ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి పంజా విసురుతోంది. తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికితోడు గ్రామాల్లో పొగమంచు కమ్మేస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు చలి నుంచి రక్షణ పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. సాయంత్రం 5గంటలు దాటితే జనాలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.

ముఖ్యంగా అడవులు అధికంగా ఉన్న మండలాలైన తిర్యాణి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికలపేట, దహెగాం, కౌటాల, సిర్పూర్‌(టి), ఆసిఫాబాద్‌ ప్రాంతాల ప్రజలు… చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, జర్కిన్లు ధరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చీకటైతే చాలు… ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 10 నుండి 6 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఒక్కోసారి 3డిగ్రీలకు పడిపోతున్నాయి. చలి పంజా విసురుతుండడంతో జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌లో కాస్త చీకటి పడితే చాలు ప్రధాన వీధులన్నీ జనం లేక బోసిపోతున్నాయి. ఉదయం 9గంటల తర్వాతే ప్రజలు బయటకు వెళ్తున్నారు. తెల్లవారుజామున పొలం పనులకు వెళ్లే రైతులు, పాలు పోసే వ్యాపారులు, పేపర్‌ బాయ్స్‌, వాకర్స్‌ చలి బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు రక్షణ లేకుండా చలిలో బయటకు వెళ్తే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.