Hyderabad లో భారీ వర్షం..శంషాబాద్ హైవేపై కొండ చిలువ, కుషాయిగూడలో కుంగిన రోడ్డు

  • Published By: madhu ,Published On : September 17, 2020 / 10:25 AM IST
Hyderabad లో భారీ వర్షం..శంషాబాద్ హైవేపై కొండ చిలువ, కుషాయిగూడలో కుంగిన రోడ్డు

హైదరాబాద్ లో భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. 2020, సెప్టెంబర్ 16వ తేదీ..బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయంది. కుండపోతగా వాన కురిసింది. చినుకుపడితేనే రహదారులపై వరద నీరు పోటెత్తుతుంది. ఇక భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులు తలపించాయి.



వాహనాలు నీట మునిగిపోయాయి. వరద ధాటికి కొన్ని వాహనాలు కొట్టుకపోయాయి. వీటిని పట్టుకొనేందుకు వాహనదారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక లోతట్టు ప్రాంతాల వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి నీరు చేరడంతో..కార్లు, దిచక్రవాహనాలు నీట మునిగిపోయాయి.



శంషాబాద్ హైవేపై భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఆ రోడ్డు గుండా వెళుతున్న వారు భయాందోళనలకు గురయ్యారు. అది రోడ్డుపై వెళుతూ..చెట్లలోకి వెళ్లిపోయింది. అది వెళ్లిపోయిన తర్వాత..వాహనారులు వెళ్లారు. ఇక కుషాయి గూడలోని ఏఎస్ రావ్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో ఎవరూ ప్రయాణించకపోవడంతో ప్రమాదం తప్పింది.

నాన్ స్టాప్ కురిసిన వర్షానికి బేగంపేట, పంజాగుట్ట, సోమాజిగూడ తదతర ప్రాంతాల్లో మోకాలలోతు వర్షపు నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్, కోఠి, ఆబిడ్స్, నారాయణగూడ, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాలు వణికిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు వాన దంచికొట్టడంతో జనజీవనం స్తంభించిపోయింది.



ఇంటికి వెళ్లే సమయంలో వాన కురవడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ట్రాఫిక్, పోలీసు శాఖ పలు సూచనలు చేసింది. వాన కురిసే సమయంలో బయటకు రావద్దని, మూలమలుపుల వద్ద జాగ్రత్తగా నడుపాలని సూచించారు.



షేక్ పేటలో 11 సెంటిమీటర్లు, ఫిల్మ్ నగర్, జూ పార్కు, అత్తాపూర్ లో 10 సెం.మీటర్లు, కార్వాన్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ 09 సెం.మీటర్లు, శ్రీనగర్ కాలనీ, పాతబస్తీ, ఉప్పల్, మెహిదిపట్నం, గచ్చిబౌలి 08 సెంటిమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.