హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన, నీటిలో కాలనీలు

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 06:21 AM IST
హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన, నీటిలో కాలనీలు

Heavy rains in Hyderabad : భారీ వర్షం భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



గ్యాప్‌ ఇవ్వకుండా కురిసిన వర్షంతో.. షాన్‌ ఏ షహర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ చిగురుటాకులా వణికింది. వర్షం పేరు చెబితేనే మహానగర వాసులు బెంబేలెత్తుతున్నాయి. మరోవైపు సహాయక చర్యలు చేపట్టలేక బల్దియా సిబ్బంది చేతులెత్తేశారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో.. స్థానికులు అవస్థలు పడుతున్నారు.



మూడు గంటల వాన హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడటంతో… కాలనీలు నీట మునిగిపోయాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. అసిఫ్‌నగర్‌లో రికార్డ్ స్థాయిలో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగర్‌ కాలనీ, ఖైరతాబాద్‌లో 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.



భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఖైరతాబాద్‌లో చాలా అపార్ట్‌మెంట్లలో సెల్లార్ల నిండా వరదనీరు చేరింది. దీంతో కాలనీవాసులు ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. భారీ వర్షంతో ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు మొరాయించడంతో వరద నీటిలోనే చిక్కుకుని అవస్థలు పడ్డారు



సాయంత్రపు వేళ చిన్నగా మొదలైన వర్షం… ఆ తర్వాత కొద్ది కొద్దిగా స్పీడ్ అందుకుంది. మూడు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షం ఒక్కసారిగా భాగ్యనగరాన్ని వణికించింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ఉద్యోగస్తులు, ప్రజలు నరకం చూశారు. గంటకు 2 సెంటిమీటర్లే తట్టుకునే హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ.. ఏకంగా 15 సెంటిమీటర్ల వర్షం కురిసేటప్పటికి అతలాకుతలం అయింది.



ఇంకా వర్షపు నీటిలోనే పలు కాలనీలు
కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ సహాయక చర్యలు
మోకాళ్లలోతు వరదనీటితో వాహనదారుల ఇబ్బందులు
ఆసిఫ్‌నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం..



కార్వాన్, బేగంపేట్‌, మలక్‌పేట్‌, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం
అసిఫ్ నగర్‌లో అత్యధికంగా 13 సెం.మీటర్ల వర్షపాతం
విజయనగర్‌ కాలనీలో 11 సెం.మీటర్ల వర్షపాతం
వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేటలో 10 సెం.మీ వర్షపాతం



ఖైరతాబాద్ 10.5 సెం.మీటర్ల వర్షపాతం
బంజారా హిల్స్ 9.8 సెం.మీటర్ల వర్షపాతం
షేక్ పెట్ 9.5 సెం.మీటర్ల వర్షపాతం
టోలిచౌకి 9.3 సెం.మీటర్ల వర్షపాతం