వానలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ

10TV Telugu News

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది. ప్రాజెక్టులు నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంటున్నాయి.రాష్ట్రంలో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం అప్రమత్తంగా  ఉండాలని సూచించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు దెబ్బతినే అవకాశం ఉందని, అలాగే రైల్వే శాఖ కూడా జాగ్రతగా ఉండాలని పేర్కొంది.

శనివారం రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌ లో ఇప్పటివరకు 48.8 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 64.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కాగా ఆది, సోమవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, ములు గు, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూ చించింది. కాగా, ఈ సీజన్‌లో బంగాళాఖా తంలో మూడుసార్లు అల్పపీడనం  ఏర్పడగా..  ఆగస్ట్ 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని ఈదులగట్టుపల్లిలో 27.4, వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో 27 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.ఇది గత పదేళ్ల తర్వాత అత్యధిక స్ధాయిలో నమోదైన వర్షపాతంగా రికార్డుకెక్కింది.జోరు వానలతో వరంగల్‌, ఖమ్మం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. హన్మకొండ, వరంగల్‌, కాజీపేటలోని పలు కాలనీలు నీటమునిగాయి.వరంగల్ జిల్లాలో జిల్లాలో గోదావరి తీరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హై అలర్ట్‌ ప్రకటించారు.

వరంగల్ జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.అలాగే జంపన్న వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవహరిస్తోంది. దీంతో మేడారం, పస్రా దారిలో రాకపోకలు నిలిచిపోయాయి.అడవిలో ఉన్న కొండాయి, మల్యాల, ఐలాపూర్‌ గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. మహమూబాబాద్‌ లోనూ  భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

నాగర్ కర్నూల్ జల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లాలో ఈ రోజు 30.5 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం  ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మత్తడి పోస్తున్నది. కల్వకుర్తి మండలం రామగిరి, వంగూరు మండలం  ఉల్పర వద్ద దుందుబీ వాగు పరవళ్లు తొక్కుతోంది. కొల్లాపూర్ లో ఎర్రగట్టు వాగు  పొంగి రోడ్డుపై వహిస్తోంది.