తెలంగాణలో ముంచెత్తిన వానలు…ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

  • Published By: bheemraj ,Published On : August 15, 2020 / 08:06 PM IST
తెలంగాణలో ముంచెత్తిన వానలు…ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంగి తిరుగుతోంది. అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉధృతంగా వ్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా గోవిందరావు పేట మండలం లక్నవరం జలాశయం నిండటంతో మత్తడి పోయింది. ఇక ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జంపన్న వాగు బ్రిడ్జీపై ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఊరట్టం, కన్నెపల్లి, మేడారం, నార్లపూర్, రెడ్డిగూడెం గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి.

వరంగల్ రూరల్ జిల్లా పరకాల-అంబాల ప్రధాన రహదారిపై కంటాత్మకూరు దగ్గర వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రైవేట్ బస్సు వాగులో చిక్కుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గనపురం మండలంలోని గణపు సముద్రం చెరువు మత్తడి పోస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 44 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జలాశయంలో నీటి మట్టం పెరుగుతుండటంతో లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా గోదావరికి చేరుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి నుంచి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీరు ప్రవహిస్తోంది.

ఖమ్మం నగరంలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 22 అడుగులకు ప్రవాహం చేరుకుంది. ఖమ్మంలో బొక్కలగడ్డ, బైపాస్ రోడ్డు, దానవాయిగూడెం, పెద్ద తండా ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మున్నేరు నది ఉదృతిని మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు. అధికారులను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కరీంగనగర్ జిల్లా కాలేశ్వరం దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లక్ష్మీ బ్యారేజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 57 గేట్లు ఎత్తి 2 లక్షల 42 వేల 500 క్యూసెక్కులను నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిసామర్థ్యం 16.17 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 8.068 టీఎంసీలుగా ఉంది.

గోదావరి నదిలో నీటి ఉధృతి పెరుగుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజుపడుగు దగ్గర నిర్మించిన సరస్వతి పంప్ హౌజ్ లో మోటార్లను ఆపు చేశారు. ఇవాళ ఉదయం వరకు పార్వతీ బ్యారేజ్ లోని నీటిని ఎత్తిపోశారు. అయితే భారీ వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. ఎన్ ఫ్లో 16 వేల 775 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2 వేల 295 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు ఉంది. అయితే ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1076 అడుగులకు చేరింది. ఇక జలాశయం నీటి సామర్థ్యం 90 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 42.452 టీఎంసీలు ఉంది.

మహారాష్ట్ర, కర్నాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జూరాల జల కళను సంతరించుకుంది. జలాశయానికి లక్ష 60 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, లక్ష 48 వేల 925 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయ నీటి మట్టం 318.5 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లుగా ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ హెలికాప్టర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుపట్ల మండలం కుందనపల్లి గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు అక్కడున్న చలివాగులో చిక్కుకుపోయారు. వ్యవసాయ మోటర్లకు సంబంధించి పంపు సెట్లను రక్షించుకునే క్రమంలో వరద ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మొత్తం 10 రైతులు వరదలో చిక్కుకున్నారు.

వారంతా ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్నవారంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సమాచారం ఇచ్చారు. గండ్ర..కేటీఆర్ కు సమాచారం ఇచ్చి రక్షించాలని కోరడతో స్పందించిన కేటీఆర్, ఏవియేషన్ అధికారులు, సీఎస్ సోమేష్ కుమార్ లతో మాట్లాడి రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు సుమారు గంటలోపే ఘటనాస్థలికి చేరుకుని అత్యంత సమయ స్ఫూర్తితో వ్యవహరించారు.

చలివాగు మొత్తాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వాగులో చిక్కుకున్న వారు ఎక్కడున్నారనే విషయాన్ని గుర్తించి..వారిని ఎక్కడ ల్యాండ్ చేయాలనే ఒక పక్డబందీ వ్యూహంతో జిల్లా కలెక్టర్, అదనపు ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో వీరంతా ప్రణాళిక ప్రకారం రైతులను సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు.