రాష్ట్రంలో భారీ వర్షాలు, సర్టిఫికేట్లు పోతే కొత్తవి ఇస్తాం – సబిత..

  • Published By: madhu ,Published On : October 21, 2020 / 09:18 AM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు, సర్టిఫికేట్లు పోతే కొత్తవి ఇస్తాం – సబిత..

Heavy rains in the state Minister Sabita : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు పోటెత్తాయి. కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకపోవడమే కాకుండా..ఇళ్లల్లోకి నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో కట్టుబట్టలతో నిరాశ్రులయ్యారు ఎంతో మంది. అయితే..చాలా మంది సర్టిఫికేట్లు కూడా నీట మునిగి పాడైపోయాయి.



ఈ క్రమంలో..తమ సర్టిఫికేట్లు పాడైపోయాయని, కొత్తవి జారీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు అనేక డిమాండ్లు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్లు పాడైపోయిన వారికి కొత్తవి జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.



కొత్తవి/డూప్లికేట్‌ సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో జరగాల్సిన అన్ని రకాల ఎగ్జామ్స్ ను వాయిదా వేసినట్లు మంత్రి సబిత ప్రకటించారు. జేఎన్‌టీయూహెచ్‌లో పరీక్షలు జరగాల్సి ఉంది. మంత్రి ఆదేశాలతో 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.



ఈ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ వెల్లడించారు. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఈ నెల 21, 22, 23న నిర్వహించాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశామని వర్సిటీ అధికారులు ప్రకటించారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.