Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

హైద‌రాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వాన కురిసింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండ

Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

Hyderabad Rains

Hyderabad Rains : హైద‌రాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వాన కురిసింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఖైర‌తాబాద్‌, అమీర్‌పేట‌, సోమాజిగూడ‌, సికింద్రాబాద్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.

భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షంతో నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పాతబస్తీ బహదూర్‌పురా దగ్గర రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.

ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో స‌ముద్ర మ‌ట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. శనివారం ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపుల‌తో చాలా చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.