Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలో కుండపోత వాన, ఆందోళనలో అన్నదాతలు

Telangana Rains : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా పరిగిలో గంటన్నర పాటు వర్షం బీభత్సం సృష్టించింది.

Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలో కుండపోత వాన, ఆందోళనలో అన్నదాతలు

Telangana Rains

Telangana Rains : తెలంగాణను వరుణుడు వెంటాడుతున్నాడు. రాష్ట్రంలో వద్దన్నా వానలు పడుతున్నాయి. ఆదివారం(ఏప్రిల్ 30) కూడా పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తరం, మలహార్, పలిమేల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లాలో వాన పడింది. అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చేతికి అందాల్సిన పంట నీటిపాలు కావడంతో రైతన్నలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంచిర్యాల-జన్నారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో గంటన్నర పాటు వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పరిగి- షాద్ నగర్ ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి.

Also Read..Heavy Rains : తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్- బీజాపూర్ 167 హైవేపై సూచన బోర్డు నేలకొరిగింది. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. శివారెడ్డి పల్లి గ్రామంలో విద్యుత్ స్థంభాలు ఇళ్లపై కూలాయి. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామాల్లో అంధకారం నెలకొంది.

వరంగల్ నగరంలోని హనుమకొండ, కాజీపేట, వరంగల్ లో భారీ వర్షం కురిసింది. హనుమకొండలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Also Read..Hyderabad Rain : ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ వార్నింగ్

ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడుతుంటే, వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రానున్న 5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 5 రోజులు తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమ్రుంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని అంచనా వేసింది.