Hyderabad కు బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది

  • Published By: madhu ,Published On : September 15, 2020 / 10:12 AM IST
Hyderabad కు బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది

Mumbai to Hyderabad : భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలును పరుగులు పెట్టించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది.



ఇందులో ముంబయి టూ హైదరాబాద్‌ మార్గం కూడా ఒకటి. ఏడు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఈ ఏడు ప్రాజెక్టుల మొత్తం వ్యయం దాదాపు 10 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేస్తోంది.
https://10tv.in/mukesh-ambanis-new-mercedes-s600-guard-is-his-most-expensive-bulletproof-car/
ఇక దేశంలోని పెద్ద నగరాలు, ఎకనమిక్‌ సెంటర్లను హై స్పీడ్‌ రైలు ద్వారా కనెక్ట్‌ చేయాలనుకుంటోంది కేంద్రం. ఈ ఏడు ప్రాజెక్టుల స్టడీ కోసం జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ ఓ కన్సల్టెంట్‌ను నియమించే పనిలో ఉంది. ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ డిమాండు, ఏ రూట్‌లో ప్రాజెక్టును చేపడితే బాగుంటుందో తెలుసుకోనుంది.



నివేదిక రెడీ అయ్యాక చివరి పరిశీలన కోసం రైల్వే బోర్డుకు ఇవ్వనుంది. తర్వాత కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఇక ముంబై టూ హైదరాబాద్‌ మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్లను నిర్మించనున్నారు. దానికి సంబంధించిన నివేదిక సిద్ధమయ్యాక భూ సేకరణపై దృష్టిసారించనున్నారు.

అలాగే బ్లూప్రింట్‌ను రూపొందించి పనిలో రైల్వే శాఖ నిమగ్నమైంది. ఇటు దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దాని అంచనా వ్యయం 1.08 లక్షల కోట్లు. వాస్తవానికి ఆ మార్గంలో 2023 డిసెంబరులో బుల్లెట్‌ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.



అయితే భూ సేకరణ సంబంధిత సమస్యలు, కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వంటి ఆటంకాల కారణంగా ఆ ప్రారంభ తేదీని 2028 అక్టోబరుకు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముంబయి-అహ్మదాబాద్‌ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 63 శాతం భూసేకరణ పూర్తయింది. మొత్తంగా… తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభమవ్వడానికే ఇంకా ఎనిమిదేళ్లు పట్టనుండటంతో… మిగతా ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఏదేమైనా హైదరాబాద్‌కు కొన్నేళ్ల తర్వాత ట్రైన్‌ బుల్లెట్ స్పీడ్‌తో దూసుకురానుంది. భాగ్యనగర కీర్తిని మరింత పెంచనుంది.