రూ.10వేల సాయం నిలిపివేతతో మీసేవ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత

  • Published By: naveen ,Published On : November 18, 2020 / 05:22 PM IST
రూ.10వేల సాయం నిలిపివేతతో మీసేవ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత

tension at mee seva centres: హైదరాబాద్ లో వరదసాయం పంపిణీకి బ్రేక్‌ వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో మీసేవ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసీ నిర్ణయంతో మీసేవ కేంద్రాల నిర్వహాకులు అప్లికేషన్లు తీసుకోవడం ఆపేశారు. దీంతో మీసేవ కేంద్రాల దగ్గర ఉదయం నుంచి పడిగాపులు కాసిన వాళ్లంతా రోడ్డెక్కి నిరసన తెలిపారు. బాధితులు ఆందోళనకు దిగారు.

ఉదయం నుంచి పడిగాపులు పడితే ఇప్పుడు ఎలా బంద్‌ చేస్తారు?
దోమలగూడ మీసేవ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో.. మీసేవ కేంద్రాలను మూసివేశారు అధికారులు. ఒక్కసారిగా మూసివేయడంతో వరద బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి పడిగాపులు పడితే ఇప్పుడు ఎలా బంద్‌ చేస్తారని వాగ్వాదానికి దిగారు. భారీగా మోహరించిన పోలీసులు…. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది వెళ్లిపోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆర్థికసాయం కోసం వేచిచూస్తున్న వరద బాధితులు… తాము వెనుదిరిగేది లేదంటూ అక్కడ ఉండిపోయారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

మీ సేవ కేంద్రం దగ్గర వృద్దురాలు మృతి:
మీ సేవ కేంద్రానికి వెళ్లిన ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన గోల్కోండ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగింది. వరద సాయం కోసం మీ సేవ కేంద్రం దగ్గర ఓ వృద్ధురాలు క్యూ లైన్‌లో నిల్చోని ఉంది. మూడు గంటల తర్వాత ఆ వృద్ధురాలు క్యూలైన్ లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే వృద్ధురాలు మృతి చెందింది.

మీ సేవ కేంద్రాలకు పోటెత్తిన జనాలు:
తెలంగాణ ప్రభుత్వం అందించే పదివేల రూపాయల వరద సాయం కోసం ప్రజలు హైదరాబాద్‌లో నానా తిప్పలు పడుతున్నారు. జియాగూడ, పాతబస్తీ, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్‌లో తెల్లవారుజాము నుంచే ప్రజలు మీ సేవా సెంటర్ల ముందు క్యూ కట్టారు. మీసేవా సెంటర్ల దగ్గర ఉన్న రద్దీని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.