CM KCR : సీఎం కేసీఆర్, తుమ్మల కలయికపై హాట్ హాట్‌గా చర్చ

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాపర్ లో తనతో పాటు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎంని కోరినట్లు చెప్పారు.

CM KCR : సీఎం కేసీఆర్, తుమ్మల కలయికపై హాట్ హాట్‌గా చర్చ

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో నేరుగా మాట్లాడారు. అండగా ఉంటామని సీఎం కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బోనకల్లు మండలం రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. వడగాళ్ల వానతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించారు. వానలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాపర్ లో తనతో పాటు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్.

Also Read..Tummala Nageshwarao: మాజీ మంత్రి తుమ్మల దారెటు? నేడు కార్యకర్తలతో భేటీ.. పార్టీ మారుతారా?

మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ లో నష్టం జరిగిన పంట పొలాలను సందర్శించారు. ఆ పొలాల రైతులతో మాట్లాడారు. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ భేటీ తర్వాత తుమ్మల మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎంని కోరినట్లు చెప్పారు. గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్ కి అనుసంధానం చేయాలని సీఎంని కోరినట్లు తెలిపారు. టన్నెల్ నిర్మాణంలో అడ్డంకులపై చర్చించామన్నారు.

Also Read..Khammam Assembly Constituency: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరానన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేద్దామని, అడ్డంకులపై సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ తన రాజకీయ కల అన్నారు తుమ్మల. సీఎం కేసీఆర్ తో భేటీలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కాగా, సీఎం కేసీఆర్ తుమ్మల కలయిక జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పారు. నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలే తప్ప.. నారాజ్ కారాదని అన్నారు. కౌలు రైతులను కూడా సమన్వయం చేసి వారికి సాయం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.