Hot Summer In September: బాబోయ్.. వర్షాకాలంలో మండిపోతున్న ఎండలు.. జనం ఉక్కిరిబిక్కిరి

సెప్టెంబర్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజుకురోజుకు పెరుగుతున్న ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Hot Summer In September: బాబోయ్.. వర్షాకాలంలో మండిపోతున్న ఎండలు.. జనం ఉక్కిరిబిక్కిరి

Hot Summer In September : సెప్టెంబర్ అంటేనే వానాకాలం. ఈ నెలలో వానలు ఎక్కువగా కురవాలి. వాతావరణం చల్లగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనాలి. చల్లని గాలిలో సేదతీరాలి. కానీ, తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. వర్షాలతో చల్లగా ఉండాల్సిన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

సెప్టెంబర్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజుకురోజుకు పెరుగుతున్న ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల ధాటికి విలవిలలాడిపోతున్నారు. కూల్ గా ఉండాల్సిన సమయంలో తెలంగాణలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. వానాకాలం అయిన సెప్టెంబర్ నెలలోనూ వేసవి కాలం స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

నిన్న ఆదిలాబాద్ జిల్లా అర్లీలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల సెప్టెంబర్ చరిత్రలో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఆదిలాబాద్ లో 2015 సెప్టెంబర్ 11న అత్యధిక ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలుగా నమోదైంది. ఇప్పడు ఉష్ణోగ్రత మరింత పెరిగింది.

రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో ఏసీలతో పనుండదు. కానీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఏసీలను ఆన్ చేయాల్సి వస్తోంది. మొన్న రాత్రి హైదరాబాద్ కిషన్ బాగ్ లో 27.5 డిగ్రీలు, ఎల్బీ స్టేడియం దగ్గర 25.6, భద్రాచలంలో 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ ల సెప్టెంబర్ నెలలో రాత్రుల్లో సాధారణ ఉష్ణోగ్రత 22.3 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ఉక్కపోత పెరగడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని వాతావరణ శాఖ ప్రకటించింది.

రుతుపవనాలు హిమాలయాల వైపు వెళ్లిపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కానీ, ఆవర్తనం కానీ లేకపోవడంతో వేడి పెరుగుతోంది. రేపు, ఎల్లుండి వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ వర్షాలు పడి వాతావరణం చల్లబడే చాన్సుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగితే పైర్ల ఎదుగుదల, పంట దిగుబడులపైనా ప్రభావం పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సోయా చిక్కుడు, మొక్కజొన్న, మినుము, పెసర తదితర పంటల గింజలు గట్టిపడకుండా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధిక వేడి వల్ల ఇళ్లు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. నిన్న గరిష్ట విద్యుత్ డిమాండ్ 12వేల 860 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 3న డిమాండ్ 8వేల 416 మెగావాట్ల కరెంట్ వినియోగం జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. ఇది 4వేల 444 మెగావాట్లు అధికం.