మరో గండం : 5 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది

  • Published By: madhu ,Published On : October 16, 2020 / 06:50 AM IST
మరో గండం : 5 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో అలర్ట్ చేసింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.



జలదిగ్భందంలోనే నగరం : –
వర్షాలు ఆగినా… హైదరాబాద్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. హైదరాబాద్‌కు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వర్షం తెరిపి ఇచ్చినా… మళ్లీ ప్రతాపం చూపించే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా వాతావరణం ఎలా వుండబోతోంది వాతావరణ కేంద్రం తెలిపింది.



ఐదు రోజులు : –
అయిదు రోజుల్లో మొదటి మూడు రోజులు అంటే అక్టోబర్ 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బులెటిన్‌లో పేర్కొన్నారు.



19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు. దక్షిణ మధ్య మహారాష్ట్ర, కొంకన్ ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.



దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరం మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని అధికారులు చెప్పారు.



ఆ తర్వాత అల్పపీడనం అక్టోబర్ 16, 17వ తేదీల్లో మహారాష్ట్ర ఆనుకుని ఉన్న తూర్పు, ఈశాన్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.

ఇటు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతూ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలకు కారణం కానుంది.

అక్టోబర్ 19వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సంకేతాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

దీని ప్రభావంతో.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.



భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందంటోంది.