ఇష్టం లేదన్న సమ్మక్క.. పగిడిద్ద రాజుతో పెళ్లి ఎలా జరిగింది?

  • Published By: sreehari ,Published On : February 3, 2020 / 03:09 PM IST
ఇష్టం లేదన్న సమ్మక్క.. పగిడిద్ద రాజుతో పెళ్లి ఎలా జరిగింది?

చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా.. సమ్మక్క బయ్యక్కపేటలో జన్మించింది. జాతర జరిగే మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. 1962 వరకూ మేడారం జాతరను  బయ్యక్కపేటలోనే నిర్వహించారు గిరిజనులు. స్వయంగా చందా వంశస్తులే సమ్మక్కను ఆరాధించారు. గ్రామంలో సమ్మక్కకు గుడితో పాటు గద్దె కూడా నిర్మించారు. జంతువును బలి ఇస్తూ రెండేళ్ల  కోసారి జాతర నిర్వహించేవారు. 

సమ్మక్కగా నామకరణం :
అసలు విషయంలోకి వెళ్తే.. రాయిబండ రాజుకు పెద్ద భార్య చందబోయిరాలు, చిన్న భార్య కనకంబోయిరాలు. ఎన్ని వ్రతాలు, నోములు చేసినా సంతానం కలగలేదు. దీంతో పెద్ద భార్య ఆదిశక్తిని, చిన్న భార్య నాగదేవతను పూజించారు. ఓ రోజున చందబోయిరాలు దుంపల కోసం కొంత మంది మహిళలతో కలిసి అడవికి వెళ్లింది. ఎల్లేరు గడ్డను తవ్వుతుండగా గుణపానికి ఏదో తగిలింది. పూర్తిగా తవ్వి బయటకు తీసి చూడగా పెట్టెలో పసిబిడ్డ కనిపించింది. ఆదిశక్తి ప్రసాదించిన సంతానంగా భావించి కన్నుల పండుగగా మేళతాళాలాతో ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సమ్మక్కగా నామకరణం చేశారని చెబుతున్నారు చందా వంశీయులు. పౌర్ణమి రోజున దొరికిన పాపను చూసి ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. 

నాగులమ్మ మాటలు నమ్మి :
ఆ తర్వాత పెద్ద భార్యకు మణ్యుడు, గండ్రగొడ్డలి అనే ఇద్దరు పిల్లలు జన్మించగా.. చిన్న భార్య కనకంబోయిరాలుకు నాగులమ్మతో పాటు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. పిల్లలు పెరిగి పెద్దవారవ్వడంతో… సమ్మక్క, నాగులమ్మకు రాజకుమారులతో వివాహం చేయాలని భావించారు. చివరకు రాజు తన చెల్లెలు కుమారుడు పగిడిద్దరాజుని సమ్మక్కతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పగిడిద్ద రాజు అందచందాలకు ముగ్దురాలైన నాగులమ్మ అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే పగిడిద్ద రాజుపై సమ్మక్కకు లేనిపోని అబద్దాలు నూరిపోస్తుంది. దీంతో సమ్మక్క.. పగిడిద్దరాజును వివాహం చేసుకునేందుకు ఇష్టపడలేదు. 

వారిద్దరిని పెళ్లాడిన పగిడిద్ద రాజు :
అయితే గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం నాగులమ్మను పగిడిద్ద రాజుతో పెళ్లి చేయాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పగిడిద్దరాజు అందాలు చూసి సమ్మక్క మనసు పారేసుకుంటుంది. తన సోదరి నాగులమ్మ మోసం చేసిందని గ్రహించి.. పగిడిద్ద రాజునే వివాహం  చేసుకుంటానని పెళ్లి పీటల మీద భీష్మించుకుకూర్చుంటుంది. ఆ సమయంలో జరిగిన గలాటలో నాగులమ్మ కడియం తగిలి పగిడిద్ద రాజు నుదుటి దగ్గర గాయమై రక్తం చిందుతుంది. ఆ తర్వాత అదే వేదికపై సమ్మక్కతో పాటు నాగులమ్మను పగిడిద్దరాజు వివాహం చేసుకున్నాడని గిరిజన పెద్దలు చెబుతున్నారు.