జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఎలా జరుగుతుందంటే?

  • Published By: bheemraj ,Published On : December 6, 2020 / 09:18 AM IST
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఎలా జరుగుతుందంటే?

GHMC Mayor and Deputy Mayor election : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎన్నిక ఎలా జరుగుతుంది. ఎవరెవరు ఎన్నుకుంటారనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్‌ పరిధిలోని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు. గ్రేటర్‌లో 45 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు, 150 కార్పొరేటర్లతో కలిపి మొత్తం 195 మంది మేయర్‌ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. వీరందరూ మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు.



జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు మేయర్‌ను ఎన్నుకునేందుకు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమకు అందిన నోటీసు(ఆహ్వానం)తో రావాల్సి ఉంటుంది. ఎన్నికకు కనీసం మూడు రోజుల ముందు సమాచారం పంపుతారు. తొలుత ఎన్నికైన పాలకమండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీలో ప్రమాణ పత్రాలు ఉంచుతారు. మేయర్‌ అభ్యర్థిత్వానికి ఒకరు పేరును ప్రతిపాదించాలి. మరొకరు బలపరచాలి. చెయ్యి పైకెత్తడం ద్వారా ఓటింగ్‌ ఉంటుంది.. ఎవరికి అనుకూలంగా ఎందరు చేతులెత్తారో లెక్కిస్తారు. పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని మేయర్‌గా ప్రకటిస్తారు.



డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కూడా ఈ తరహాలోనే జరుగుతుంది. తొలుత మేయర్, తర్వాత డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించాలి. ఎన్నిక నిర్వహించాలంటే ఎక్స్‌అఫీషియోలతో సహ మొత్తం ఓటర్లలో కనీసం 50 శాతం మంది హాజరు ఉండాలి. దీన్ని కోరంగా పరిగణిస్తారు. కోరం లేని పక్షంలో గంటసేపు వేచి చూస్తారు. అప్పటికీ లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. మర్నాడు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అక్కడి నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు.



జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియోలుగా పేర్లు నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ మేయర్‌ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. అయితే వీరు తాము మరే పురపాలికలోనూ ఓటు వేయలేదనే డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. మేయర్‌ పదవికి పోటీ చేసేందుకు మాత్రం కార్పొరేటర్లే అర్హులు.



గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్‌ జారీ చేస్తాయి. ఎన్నికకు 24 గంటల ముందు పార్టీ అధ్యక్షుడు లేదా ఆయన అధీకృతంగా నియమించిన వారు విప్‌ జారీ చేయవచ్చు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారికి తెలియజేయాలి. ఇదిలాఉండగా.. విప్‌ ఉల్లంఘించిన వారు ఒకవేళ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే, తుదితీర్పు మేరకు చర్యలుంటాయి. అప్పటివరకు వారి పదవికి ఢోకా ఉండదని సంబంధిత అధికారి తెలిపారు.