ఎన్నడూ లేని విధంగా బీజేపీలో ఆ టికెట్ కోసం భారీ పోటీ, కారణం అదేనా

  • Published By: naveen ,Published On : November 21, 2020 / 11:18 AM IST
ఎన్నడూ లేని విధంగా బీజేపీలో ఆ టికెట్ కోసం భారీ పోటీ, కారణం అదేనా

bjp mlc elections: వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు కమలం నేతలు కేడర్‌ను రెడీ చేస్తున్నారు. దీంతో అధిష్టానం దగ్గర పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్గత సమావేశాలతో బిజీబిజీగా గడుపుతూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఇప్పటి నుంచే టికెట్ దక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు తానే సరైన అభ్యర్థినంటూ ప్లస్ మైనస్ లెక్కలతో నేతలు సిద్ధమవుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా.. టికెట్ కోసం నేతల దూకుడు చూసి పార్టీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోందని అంటున్నారు.

గెలుపే లక్ష్యంగా ముందుకు:
రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో కమలనాథులు ముందుకు కదులుతున్నారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు రెండో స్థానంలో నిలిచారు. గట్టి పోటీనిచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుండా టీఆర్‌ఎస్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏడాదిగా వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు బీజేపీలో చేరారు. ఈసారి గెలుపు ఖాయమని లెక్కలు వేస్తున్నారట.

టికెట్ కోసం భారీ పోటీ:
ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇటీవల బీజేపీలో చేరిన నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు కూడా క్యూలో ఉన్నారని అంటున్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి తమకు ప్రాధాన్యం ఇస్తారనే ఆశతో ఉంటే.. మొదటి నుంచి పార్టీలో చురుకుగా ఉన్న తమకే టికెట్ ఇవ్వాలని గతంలో పోటీ చేసిన రామ్మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మనోహర్‌ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పార్టీకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సీనియర్‌ నేత పేరాల శేఖర్‌రావు కూడా పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం.
https://10tv.in/bandi-sanjays-inappropriate-remarks-on-cm-kcr-trs-leaders-complaint-to-state-election-commission/
టికెట్ కోసం అగ్రనేతలతో సంప్రదింపులు:
ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్న సీనియర్లు.. టికెట్‌ కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కేడర్‌లో చర్చ నడుస్తోంది. రాజ్యసభ సభ్యుడైన గరికపాటి మోహన్‌రావు బీజేపీలో క్రియాశీలంగా ఉండటం తమకు ప్లస్‌ పాయింట్‌ అవుతుందని టీడీపీ నుంచి పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు. గతంలో బీజేపీ ఎలాంటి చేరికలు లేకుండానే టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొందని, ఈసారి వివిధ పార్టీల్లో అగ్రనేతలు కమలదళంలో కలవడం మరింత కలిసి వచ్చి సునాయాసంగా గెలుస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఈసారి ఇక్కడి నుంచి పోటీకి బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు.

పరిశీలనలో పెద్దిరెడ్డి, రేవూరి పేర్లు:
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్లను బీజేపీ నాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డి రెండు పర్యాయాలు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం, కార్మిక సంఘాలకు రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. ఇక టీడీపీలో కీలకంగా వ్యవహరించిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా, ఆ పార్టీ జాతీయ వ్యవహరాల్లో పాల్గొని బీజేపీలో చేరారు. బీజేపీలో వివిధ కేడర్‌లలో పనిచేస్తూ ఎదిగిన సీనియర్లు కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమెందర్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, నల్గొండకు చెందిన మనోహర్‌రెడ్డి కూడా టికెట్‌ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. పోటా పోటీ ప్రయత్నాల్లో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=p-zmZ9ejKSk