క‌రోనా ఎఫెక్ట్ తో భారీగా త‌గ్గిన‌ ఆదాయం..టీ-స‌ర్కార్ అప్పుల బాట

క‌రోనా ఎఫెక్ట్ తో భారీగా త‌గ్గిన‌ ఆదాయం..టీ-స‌ర్కార్ అప్పుల బాట

Huge reduction in income of telangana with Corona effect : తెలంగాణ ఖ‌జానాకు క‌రోనా క‌ష్టాలు తప్పడం లేదు. రాబడి తగ్గిపోయి.. ఖర్చు పెరిగిపోవడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలుకు అప్పుల బాట పట్టింది.. టీ-సర్కార్. దీంతో డిసెంబర్‌ నాటికి 42వేల కోట్ల అప్పుల భారం ప్రభుత్వంపై పడింది..! కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుప్పకూలాయ్. లాక్‌డౌన్ పుణ్యమా అని ఏ రంగంల కోలుకోలేని పరిస్థితి. మహమ్మారి ప్రభావం ప్రభుత్వాలపై కూడా పడుతోంది. కరోనా దెబ్బకు తెలంగాణ ఖజానా విలవిలలాడుతోంది. ఆదాయం లేకపోయిన ఖర్చులు మాత్రం పెరిగిపోవడంతో.. దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు సర్కార్ నానా ఇబ్బందులు పడుతోంది.

తెలంగాణ బడ్జెట్ అంచనా లక్షా 82వేల కోట్లు. వివిధ పన్నులతో సమకూర్చుకోవాల్సిన ఆదాయం లక్షా 43వేల కోట్లు. అయితే, కాగ్ లెక్కల ప్రకారం కరోనా ప్రభావంతో అక్టోబర్ నాటి కేవలం 38వేల 530 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 45వేల 286 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి 32వేల 671 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం 12వేల 887 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. ఇతర పన్నుల ద్వారా 26వేల 400 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. పది వేల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇక రిజిస్ట్రేషన్ ద్వారా పదివేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. 15వందల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది.

ఇలా అన్ని రకాలకు కరోనా ప్రభుత్వ ఆదాయనికి గండికొట్టింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి. సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం.. ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి 41వేల 781 కోట్ల రూపాయల అప్పు చేసింది. వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకునే అప్పు ఇప్పటికే దాటిపోయింది. సాధారణంగా మొదటి ఆరునెలలు అప్పు తీసుకోకుండా.. చివరి ఆరు నెలలు అప్పు తీసుకుని నెట్టుకొస్తాయ్ అన్ని ప్రభుత్వాలు. తెలంగాణ సర్కార్‌ దానికి భిన్నంగా అప్పులు చేసేసింది.

తెలంగాణ అప్పుల భారానికి రిజిస్ట్రేషన్‌లు ఆగిపోవడం ఓ కారణమైతే.. జీఎస్టీ ఆదాయం తగ్గడం మరొకటి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ప్రభుత్వానికి సవాల్‌గా మారాయ్‌. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలకు కోత పెట్టలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో టీ-సర్కార్ అప్పులు చేయవలసిన పరిస్థితి తలెత్తింది. ఇంకా ఆర్ధిక సంవత్సరం పూర్తవడానికి మూడు నెలల సమయం ఉంది. దీంతో మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందేమోనని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది.