Huzurabad: హుజురాబాద్ ఫీవర్.. దళితులే ప్రధాన ఎజెండా!

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్‌పైనే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌ లో ఉప ఎన్నికల అనివార్యం అయింది.

Huzurabad: హుజురాబాద్ ఫీవర్.. దళితులే ప్రధాన ఎజెండా!

Huzurabad (2)

Huzurabad: తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్‌పైనే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌ లో ఉప ఎన్నికల అనివార్యం అయింది. ఉప ఎన్నిక తేదీ కూడా ఖరారు కాకముందే ప్రధాన పార్టీలన్నీ హుజురాబాద్‌‌పై ఫోకస్ పెట్టాయి. ప్రచారం కూడా చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్‌ అయింది. వైఎస్ షర్మిల కూడా బరిలో ఉండేందుకు సిద్ధమని ప్రకటించగా వైఎస్సార్‌టీపీ నుండి హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలిపోయింది. మరోవైపు బీఎస్పీ కూడా తన అభ్యర్థిని బరిలో దించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.

అయితే, రాష్ట్రమంతా హుజురాబాద్ ఉపఎన్నికలను చూస్తుంటే రాజకీయ పార్టీలు మాత్రం హుజురాబాద్ దళితుల చుట్టే రాజకీయం నడిపిస్తుంది. దీనికి కారణం ఇక్కడ దళితుల ఓట్లు యాభై వేలకు పైగా ఉండడం. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత ఓటర్లను ఆకట్టుకొనేలా దళితబంధును ప్రకటించడమే కాకుండా నిధులు కూడా వరసపెట్టి విడుదల చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుండి బరిలో దిగిన మాజీ మంత్రి ఈటల తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహాలతో రచిస్తున్నారు. ఓటుకు లక్ష వెదజల్లిన ప్రజలు తనవైపే ఉన్నారని ఈటల బల్లగుద్ది చెప్తున్నాడు.

మరోవైపు టీఆర్ఎస్ ఈటలను విమర్శిస్తూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తూనే ఈటల వర్గంలోని నేతలను కూడా టీఆర్ఎస్ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. దళితుల మీద ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్ సర్కార్ మిగతా అణగారిన వర్గాలను ఎందుకు వదిలేస్తుందంటూ కాంగ్రెస్ మిగతా వర్గాలను టార్గెట్ చేసి రాజకీయంగా టీఆర్ఎస్ ను బైండోవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఎస్పీ నుండి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ను రంగంలోకి దింపాలని సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే ఇక్కడ నుండి పోరు మరింత రసవత్తరంగా మారుతుంది. మొత్తంగా చూస్తే హుజురాబాద్ రాజకీయం అంతా దళితుల చుట్టే తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఇక్కడ నుండి రాజకీయం వాడీవేడిగా మారడంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌ నెలలో హుజురాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వస్తుందని ప్రచారం జరుగుతుండడంతో రాజకీయ పార్టీలు మరింత దూకుడుగా ఇక్కడ పావులు కదుపుతున్నాయి.