నిఘా నీడలో నగరం : స్పాట్ ఏదైనా స్పాట్ లో ఇన్ఫర్మేషన్

10TV Telugu News

hyderabad-city-10 Lakh CCTV cameras Minister KTR : అత్యంత సేఫ్‌ సిటీగా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. పోలీస్, పురపాలక శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్‌.. భాగ్యనగరంలో 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే.. మరింత సురక్షితం నగరంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం కాపలా కాసే సీసీ కెమెరాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. డిజిపి, మూడు కమిషనరేట్ల కమిషనర్లు, జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్‌ పలు కీలక ప్రతిపాదనలు చేశారు.నగరంలో దాదాపు 5లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్‌. మొత్తం 10 లక్షల కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అత్యధిక సీసీ కెమెరాలున్న నగరంగా.. దేశంలోనే హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారాయన.ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగానే గత ఆరేళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు నగరం విస్తరిస్తున్న క్రమంలో మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్‌. జీహెచ్ఎంసి నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.అలాగే పార్కులు, చెరువులు, బస్తీ దవాఖాన, మెట్రో పిల్లర్లను సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. ప్రజలు గూమి కూడే ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్‌. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు ఉండే చోట సీసీ కెమెరాలు తప్పనిసరన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుండడంతో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కట్టుదిట్టంగా శాంతిభద్రతలను నిర్వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సూచనలకు అనుగుణంగా పది లక్షల సీసీ కెమెరాలను ఇన్ స్టాల్ చేసే లక్ష్యాన్ని స్వీకరించి ఆ దిశగా కార్యక్రమాలు ప్రణాళికలు కొనసాగిస్తామన్నారు.

10TV Telugu News