Hyderabad City : బతుకునిచ్చి.. బతకునేర్పే నగరం… భాగ్యనగరం

అవకాశాల గనిగా.. ఉపాధి రాజధానిగా కనిపిస్తోంది హైదరాబాద్! ప్రపంచస్థాయి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో వాలిపోగా.. భవిష్యత్‌లో మరిన్ని ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.

Hyderabad City : బతుకునిచ్చి.. బతకునేర్పే నగరం… భాగ్యనగరం

Hyderabad City Capital For Employment And Living For People

Hyderabad City Capital : అవకాశాల గనిగా.. ఉపాధి రాజధానిగా కనిపిస్తోంది హైదరాబాద్! ప్రపంచస్థాయి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో వాలిపోగా.. భవిష్యత్‌లో మరిన్ని ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ట్రాన్స్‌పోర్టు నుంచి కనెక్టివిటీ వరకు… ప్రత్యేకం అనిపిస్తోంది. ఐటీ, ఫార్మాతో పాటు పలు కీలక రంగాల్లో అవకాశాల గనిగా నిలిచింది హైదరాబాద్. ఉపాధి అవకాశాల సృష్టికి అనువైన స్టార్టప్‌ల ఏర్పాటు… వ్యాక్సిన్‌ తయారీకి అవకాశాలు ఇక్కడ నెలకొన్నాయి. ఐకమత్య జీవనంతో మతసామరస్యానికి ప్రతీకగా నగరం పేరొందింది. విభిన్న సంస్కృతులకు వేదికగా, అభివృద్ధికి అడ్డాగా మారింది. అనువైన చారిత్రక సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అభివృద్ధి, శాంతి భద్రతల్లో హైదరాబాద్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. విమానయానం.. విశాలమైన రహదారులు.. ఫ్లైఓవర్లు.. నిమిషాల్లో గమ్యం చేర్చే ఔటర్‌ రింగురోడ్డు. ఎంఎంటీఎస్‌, మెట్రోరైలు ప్రయాణం.. విస్తృత ప్రజారవాణా, అత్యాధునిక సాంకేతికత కలిగిన పోలీసు వ్యవస్థ.. ఇలా హైదరాబాద్ ప్రత్యేకతలు ఎన్నో !

అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు :
అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు.. అంకుర కంపెనీల వరకు హైదరాబాద్‌ వైపే చూస్తున్నాయ్. టీహబ్‌ను ఏర్పాటు చేసి స్టార్టప్‌ క్యాపిటల్‌గా నగరాన్ని తీర్చిదిద్దింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలు మైక్రోసాఫ్ట్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌, అమెజాన్‌, ఐకియా ఇలా పదుల సంఖ్యలో నగరంలో కొలువుదీరాయి. ఐటీ ఎగుమతుల్లో దేశవ్యాప్తంగా హైదరాబాద్ టాప్‌లో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ క్యాంపస్‌, అమెరికా తర్వాత మెక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద క్యాంపస్‌, ఆసియాలో గూగుల్‌కు మొదటి కార్యాలయం, దేశంలోనే మొదటి ఐకియా స్టోర్‌ హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయ్. ఇక ఫేస్‌బుక్‌, ఆపిల్‌ సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఇలా ఐటీకి కేరాఫ్‌గా మారుతోన్న హైదరాబాద్.. దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఐటీ కారణంగా ఒకవైపే విస్తరించడాన్నిగుర్తించిన సర్కార్… నగరాన్ని నలువైపులా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఐటీ కంపెనీలు హైదరాబాద్, వరంగల్‌ జాతీయ రహదారి చుట్టు పక్కల ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టింది. ఐటీ కంపెనీలు శంషాబాద్‌-ఆదిభట్ల, మేడ్చల్‌, కొంపల్లి, దుండిగల్‌ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఐటీ ముఖ చిత్రం మారిపోయింది. దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందినవాళ్లు కూడా హైదరాబాద్‌లో స్థిరపడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల నివాసప్రాంతాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఐటీ కారిడార్‌ నుంచే ఔటర్‌ రింగురోడ్డుకు అనుసంధానం ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది.

అంతర్జాతీయ నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ :
దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు, అంతర్జాతీయ నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం హైదరాబాద్‌. రోజుకు వందల్లో విమానాలు… 160కి పైగా రైళ్లు, 2వేలకు పైగా బస్సులు నిత్యం రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయ్. దేశంలో ఏ ప్రాంతానికైనా రెండు గంటల్లో వెళ్లే వీలుండటం భాగ్యనగరానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇక టెలిఫోన్‌ ఎక్సేంజీలు, ఆప్టిక్‌ ఫైబర్‌ కమ్యూనికేషన్‌ లైన్లు ఉండటం కూడా అనుకూలమైన అంశం. మూడు జాతీయ రహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు నగరం గుండా వెళ్తున్నాయ్. శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి దోహదం చేస్తోంది. మెట్రో‌లాంటివి ప్రజారవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నాయ్. ఇలాంటి సదుపాయాలు ఉండడంతో.. ఇక్కడే ఉండేందుకు జనాలు మొగ్గుచూపుతున్నారు.

2015-19 మధ్యకాలంలో 2.1 యూఎస్‌ బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను హైదరాబాద్ ఆకర్షించింది. ఇండియాకు 35.2 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ రాగా.. అందులో ఒక్క హైదరాబాద్‌కే 6శాతం పెట్టుబడులు వచ్చాయ్. దీంట్లో 85శాతానికి పైగా పెట్టుబడులు ఆఫీస్‌స్పేస్‌కు సంబంధించినవే. మిగతావి రిటైల్‌, వేర్‌హౌజింగ్‌ రంగానికి చెందినవి. ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 2013లో 11శాతంగా ఉంటే.. 2019కి వచ్చేసరికి అది 22శాతానికి పెరిగింది. ఐతే ఇప్పుడు చిప్​మేకర్, అమెరికన్​ మల్టీనేషనల్​ కార్పొరేషన్ ​క్వాల్​కామ్​ హైదరాబాద్​లో భారీ ఆఫీసు స్పేస్​ను లీజుకి తీసుకుంది. రహేజా ఐటీ పార్కులో ఏకంగా 16లక్షల చదరపు అడుగుల కమర్షియల్​ స్పేస్​ను పదేళ్లపాటు లీజుకు తీసుకుంది. రహేజా మాదాపూర్​లో నిర్మిస్తున్న కామర్​జోన్​ను కూడా క్వాల్​కామ్​కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

బాట సింగారంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు :
హైదరాబాద్ పరిసరప్రాంతంలోని బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసింది హెచ్ఎండీఏ. దీంతో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి, కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయ్. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గనుంది. ఇలా సిటీని సేఫ్ అంట్ క్లీన్‌గా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇక అటు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉంటారు! ఇక్కడికి వచ్చిన ఎవరైనా.. ఒక్కరోజు మాత్రమే కొత్త అనిపిస్తారు. రెండోరోజు నుంచి మనలో ఒకరు అయిపోతారు. ఇలా మినీ ఇండియాను తలపిస్తుంటుంది హైదరాబాద్. ఇన్ని సదుపాయాలు ఉన్న భాగ్యనగరంలో.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు సెటిల్ అవుతున్నారు. హైదరాబాదీస్ అయిపోతున్నారు. ఇలా పెరుగుతోన్న ఉపాధి అవకాశాలు, వాతావరణ పరిస్థితులు.. హైదరాబాద్ డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి.