Hyderabad E-Race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్ వెర్గ్నే

Hyderabad E-Race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్ వెర్గ్నే

Hyderabad E-Race: హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములా ఈ-రేసింగ్ ముగిసింది. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేయడంతో, తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడంతో 35 ల్యాప్స్ త్వరగా పూర్తయ్యాయి. ఫార్ములా ఈ-రేసింగ్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్నే నిలిచారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 11 Feb 2023 04:30 PM (IST)

    ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్ వెర్గ్నే

    హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములా ఈ-రేసింగ్ ముగిసింది. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేయడంతో, తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడంతో 35 ల్యాప్స్ త్వరగా పూర్తయ్యాయి. ఫార్ములా ఈ-రేసింగ్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్నే నిలిచారు.

  • 11 Feb 2023 03:43 PM (IST)

    ఫొటోల కోసం అభిమానుల తాకిడి

    శనివారం ప్రాక్టీస్ సెషన్ పూర్తైన తర్వాత కార్ రేసింగ్ డ్రైవర్లు కొందరు అభిమానులతో సమావేశమయ్యారు. ఇంటరాక్టివ్ సెషన్‌లో భాగంగా రేసింగ్ డ్రైవర్లు అభిమానులతో ముచ్చటించారు. వాళ్లంతా తమ అభిమాన రేసర్లతో ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి రేసర్లను కలవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

  • 11 Feb 2023 03:41 PM (IST)

    దూసుకుపోతున్న కార్లు.. గంటన్నరపాటు సాగనున్న రేసింగ్

    హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-చాంపియన్‌షిప్ రేసింగ్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రుల చేతులమీదుగా రేసింగ్ ప్రారంభమైన అనంతరం కార్లు రోడ్లపై రయ్యున దూసుకెళ్తున్నాయి. గంటన్నరపాటు ఏకధాటిగా రేసింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే క్వాలిపైయింగ్ రేస్ పూర్తికాగా, కొద్దిసేపటి క్రితమే ప్రధాన పోటీ మొదలైంది. ఈ రేస్ 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో కొనసాగుతుంది. దీనిలో 11 ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు పాల్గొంటున్నారు. ఇందులో దేశీయ కంపనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రాతోపాటు, జాగ్వార్, నిస్సాన్ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయి.

  • 11 Feb 2023 03:34 PM (IST)

    రేసింగ్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్

    దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఈ చాంపియన్‌షిప్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రేసింగ్ వీక్షించేందుకు క్రికెటర్ దీపక్ హుడాతోపాటు ఎంపీ సంతోష్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, తదితరులు హాజరయ్యారు.

  • 11 Feb 2023 03:25 PM (IST)

    ఫార్ములా ఈ-రేసింగ్‌లో సందడి చేసిన అక్కినేని నాగార్జున, డీజే టిల్లు

    ఫార్ములా ఈ-రేసింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఒకవైపు ట్రాకులపై రేసింగ్ కార్ల పరుగులతోపాటు, సెలబ్రిటీల రాకతో ఈ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. రేసింగ్ చూసేందుకు సినీ తారలు అక్కినేని నాగార్జున, యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ (డీజే టిల్లు), నారా బ్రాహ్మణి తదితరులు హాజరయ్యారు.

  • 11 Feb 2023 02:58 PM (IST)

  • 11 Feb 2023 02:55 PM (IST)

    వాహనదారులు దయచేసి సహకరించాలి: మంత్రి కేటీఆర్

    ఫార్ములా ఈ రేసింగ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షల విషయంలో వాహనదారులు సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఫార్ములా ఈ రేసింగ్ సందర్భంగా నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ఈ-రేసింగ్‌తో సాధారణ ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. వాహనదారులు దయచేసి సహకరించాలి. ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతుంది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు 30 వరకు తెస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

  • 11 Feb 2023 02:32 PM (IST)

    ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రయాణికుల తిప్పలు.. పాసులున్నా తప్పని పార్కింగ్ కష్టాలు

    ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణలో కొన్ని లోపాలు ప్రేక్షకుల్ని, వాహనదారుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రేసింగ్ కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మరోవైపు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చేవారికి పార్కింగ్ సమస్యగా మారింది. కార్లు, బైకులపై మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తున్నారు. అయితే, వారి వాహనాలు పార్కింగ్ చేసేందుకు మాత్రం నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదు. రేసింగ్ జరిగే ప్రదేశానికి చాలా దూరంలో వాహనాలు పార్కింగ్ చేయాల్సి వస్తోంది. పాసులున్నప్పటికీ, పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • 11 Feb 2023 02:28 PM (IST)

    రామ్ చరణ్ సహా సినీతారల హాజరు

    ఫార్ములా ఈ రేసింగ్ వీక్షించేందుకు పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కార్ రేసింగ్ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

  • 11 Feb 2023 02:28 PM (IST)

    ఈ రేసింగ్‌కు హాజరైన సచిన్, శిఖర్ ధావన్, గోపీచంద్

    హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్ చూసేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఆయనతోపాటు స్టార్ క్రికెటర్లు శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, బాల చౌదరి హాజరయ్యారు.