Vaccination: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్!

Vaccination: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్!

Vaccination

Biggest Vaccination Program in Hyderabad: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి హైదరాబాద్‌ వేదిక అయ్యింది. కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఐటీ ఉద్యోగుల ఛారిటీ సంస్థ భారీ కార్యక్రమాన్ని రూపొందించింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 13 గంటల్లో 50 వేల మందికి ఒకేసారి టీకాలు వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు చెందిన సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంస్థ సైబరాబాద్ పోలీసులు, మెడికోవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌తో కలిసి ఈ మెగా వ్యాక్సినేషన్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.

ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 18 ఏళ్లు పైబడిన వారికి కోవాక్సిన్‌ టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం మొత్తం 500 కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్లాట్ బుకింగ్‌ కోసం కోవిన్ నమోదు తప్పనిసరి. స్లాట్‌ సమయంలో నేరుగా వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సి ఉంటుంది. మెగా టీకా డ్రైవ్‌ కొవిడ్‌ ఉప్పెనను నియంత్రించడంలో సహాయపడుతుందని, అలాగే కరోనా థర్డ్‌ వేవ్‌కు అడ్డుకట్ట వేయగలదని భావిస్తున్నారు.

ఇందుకోసం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులు. మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేస్తున్నారు. మొత్తం 13 గంటల్లో 50 వేల మందికి ఒకేసారి వ్యాక్సిన్‌లు వేస్తుండగా.. మెగా వ్యాక్సిన్ కోసం భారీగా తరలివస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలో హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.