డోంట్ వర్రీ, మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు – ఎన్వీఎస్ రెడ్డి

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 07:57 AM IST
డోంట్ వర్రీ, మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు – ఎన్వీఎస్ రెడ్డి

Hyderabad Metro : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. మెట్రో పిల్లర్లపై వరద ఎఫెక్ట్ పడింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద డివైడర్లు కొట్టుకుపోయాయి. వరద తాకిడికి పిల్లర్ చుట్టూ నిర్మించిన సెక్యూరిటీ వాల్ పూర్తిగా ధ్వంసమైంది. అంతే కాకుండా.. మరద తాకిడికి మెట్రో పిల్లర్ల చుట్టూ భారీ స్థాయిలో గొయ్యి ఏర్పడింది.



మరోవైపు మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రోపై వదంతులు నమ్మొద్దని కోరారు. మెట్రో నిర్మాణం అంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. వర్షాలు తగ్గాక మరమ్మత్తులు చేస్తామని మెట్రో ఎండీ వెల్లడించారు.



తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం కారణంగా హైదరాబాద్‌ సహా 17 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వాతవారణశాఖ అధికారులు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీచేశారు. రాష్ట్రంలో ఈ వర్షాకాలంలో సాధారణం కంటే సుమారు 45 శాతం అధిక వర్షపాతం నమోదైంది.



వాతావరణశాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికే వానాకాలం ముగిసినా.. వరుస అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఇంకా చురుకుగానే ఉన్నాయని తెలిపింది. రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కాలేదని, వచ్చేవారం వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని పేర్కొంది. రాష్ట్రంలో రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడే అవకాశముందనీ, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్న దృష్ట్యా అత్యవసరం అయితేగానీ ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు.