హైదరాబాద్‌ మెట్రో విస్తరణ.. రెండో దశ ఎక్కడంటే

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 01:23 PM IST
హైదరాబాద్‌ మెట్రో విస్తరణ.. రెండో దశ ఎక్కడంటే

Hyderabad Metro Rail Phase2 Route Map : హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే… మెట్రో రైలు సెకండ్ ఫేస్‌ను స్టార్ట్ చేయబోతోంది. మరి రెండో దశ మెట్రో విస్తరణ ఎక్కడ.. మెట్రోతో పాటు.. మహానగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి.. హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తెచ్చేందుకు తెలంగాణ సర్కార్‌ పక్కా ప్లాన్‌ ప్రకారం ముందుకెళ్తోంది.



కరోనా తర్వాత తిరిగి ప్రారంభమైన మెట్రో రైళ్లలో జనం ఎక్కువగానే ప్రయాణిస్తున్నారు. దీంతో రెండో దశ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు మెట్రో స్టేషన్‌ నుంచి హైటెక్‌ సిటీ మీదుగా.. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు మెట్రో రైలును విస్తరించబోతున్నారు. ఈ రెండో దశ.. మొదటి దశను మించిన రేంజ్‌లో ఉండబోతోంది. 18 కిలోమీటర్ల దాకా.. బస్సుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ తేబోతున్నారు.



అలాగే.. ఔటర్‌ రింగ్‌రోడ్డు, మూసీ నది ప్రాజెక్టు వంటి వాటితో లింక్ అయ్యేలా.. అన్ని చోట్లా వాహనాల రాకపోకలు శరవేగంగా సాగేలా ప్లాన్ రెడీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో సెకండ్ ఫేజ్ ఎలా ఉండాలి.. మెట్రోతో పాటు ఇంకా ఏయే అభివృద్ధి పనులను ఒకే సమయంలో చేపట్టాలలనే అంశాలపై మెట్రో రైలు ఎండీ, పురపాలక, రోడ్లు, భవనాలు, ఆర్థిక, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శులు.. ఓ టీమ్‌గా ఏర్పాటవుతున్నారు. వీళ్లే ఈ ప్లాన్ రెడీ చేస్తారు.



ఈ సందర్భంగా మెట్రోరైలు రెండో దశ విస్తరణ, EBRTS ప్రాజెక్టులపై విజువల్ ప్రజెంటేషన్‌ను సీఎస్ సోమేష్ కుమార్ చూశారు. అది బాగుంటడంతో.. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏం చేయాలనే అంశాలపై చర్చించారు. వచ్చే ఐదేళ్ల పాటు మెట్రోరైలు పనులను AEకామ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, సింగపూర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు పర్యవేక్షిస్తాయి. ఇందుకోసం ఈ కంపెనీలకు 6.94 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు.



కరోనా వైరస్ కారణంగా మార్చిలో నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు.. సెప్టెంబర్ 7న తిరిగి ప్రారంభమయ్యాయి. మొదట్లో ఒకే కారిడార్‌లో ప్రారంభించినా… ప్రస్తుతం మూడు కారిడార్లలోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. అలాగే అన్ని స్టేషన్లనూ ఓపెన్ చేశారు. కరోనా సమస్యలు రాకుండా ప్రయాణికులంతా శానిటైజర్ వాడేలా, మాస్క్ ధరించేలా చేస్తున్నారు. ప్రయాణికులు సేఫ్ డిస్టాన్స్ పాటించేలా చేస్తూ.. మెట్రో రైళ్లలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చేస్తుండటం వంటి చర్యలతో.. ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.



దానికి తోడు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ప్రకటించడంతో ప్రయాణికులకు అది కలిసి వస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో మొదటి ఫేజ్‌లోని మూడు కారిడార్లకూ డిమాండ్ బాగుంది. ముఖ్యంగా.. హైటెక్ సిటీ రూట్, JBS నుంచి MGBS మధ్య ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. కరోనాకి ముందు అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట స్టేషన్ మళ్లీ ఇప్పుడిప్పుడే రష్ అవుతోంది. మహానగరంలో మున్ముందు మెట్రోకి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి.