Hyderabad : గంజాయి మత్తులో హైదరాబాద్, ఆపరేషన్ గంజా

Operation Ganja

Hyderabad : గంజాయి మత్తులో హైదరాబాద్, ఆపరేషన్ గంజా

Hyd Ganja

Operation Ganja : హైదరాబాద్‌ గంజాయి మత్తులో జోగుతోంది. మత్తు మాఫియాకు కేరాఫ్‌గా నిలుస్తోంది. దీంతో రంగంలోకి దిగారు హైదరాబాద్‌ పోలీసులు. ఆపరేషన్ గంజా పేరుతో.. గంజాయి విక్రయాలపై పంజా విసురుతున్నారు. గంజాయి స్మగ్లర్లు, డీలర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకు వంద మందికిపైగా గంజాయి డాన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు ధూల్‌పేట, మంగళ్‌హాట్, కర్మాన్‌ఘాట్‌, ముషీరాబాద్‌ ప్రాంతాల్లో.. సోదాలు నిర్వహించి గంజాయి బ్యాచ్‌లను అరెస్ట్‌ చేశారు. ఒక్క ముషీరాబాద్‌లోనే ఇప్పటి వరకు ముప్పై మంది గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు.

Read More : AP : నూతన మద్యం పాలసీ, తిరుపతిలో నో లిక్కర్!

గంజాయి అమ్మకాలపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మరో పదిరోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందంటున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న వారి దగ్గర నుంచి భారీగానే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో హైదరాబాద్‌కు గంజాయి సరఫరా అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని హైదరాబాద్‌ వైపు మళ్లిస్తున్నారు కేటుగాళ్లు. కొత్త కొత్త ప్లాన్స్‌తో.. పోలీసుల కళ్లు కప్పి గంజాయిని భాగ్యనగరానికి చేరవేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులే టార్గెట్‌గా గంజాయి బ్యాచ్‌లు.. తమ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. అసలు గంజాయి ఏ రూట్లలో హైదరాబాద్‌కు చేరుతోంది..? నగరంలో ఎక్కడెక్కడ గంజాయి అడ్డాలు ఉన్నాయి..? అసలు సూత్రధారులు ఎవరు..? పాత్రధారులు ఎవరనే దానిపైనా కూపీ లాగుతున్నారు హైదరాబాద్‌ పోలీసులు.

Read More : Big Boss 5: లంచ్‌కి సిరి.. డిన్నర్‌కి హమీదా.. శ్రీరామ్ రొమాంటిక్ స్టోరీ!

ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై ప్రత్యేక  నిఘా పెట్టారు. గంజాయి కొన్నా, అమ్మినా, తాగినా నేరమేనంటున్నారు పోలీసులు. దీంతో.. గంజాయి ముఠాలపైనే కాకుండా.. గంజాయి తీసుకుంటున్న వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి తాగుతూ దొరికితే జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. గంజాయి తాగే అలవాటున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్ధులతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉంటున్నారు. మరోసారి రిపీట్‌ అయితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి ఇళ్లకు పంపుతున్నారు.