Hyderabad: హైదరాబాద్ నగరానికి అరుదైన గుర్తింపు.. అదేంటో తెలుసా?

అంబేద్కర్ విగ్రహావిష్కరణతో మరో సమతా సారథి హైదరాబాద్ గడ్డపై ఠీవిగా నిల్చొని విశ్వ సందేశం ఇస్తున్న నగరంగా కీర్తి గడించింది భాగ్యనగరం.

Hyderabad: హైదరాబాద్ నగరానికి అరుదైన గుర్తింపు.. అదేంటో తెలుసా?

Hyderabad: చారిత్రక నగరం హైదరాబాద్ ఇన్నాళ్లు విశ్వనగరంగా వర్ధిల్లుతోంది. సమానత్వ సారథి అంబేద్కర్ విగ్రహావిష్కరణతో ఇప్పుడు భాగ్యనగరం సమానత్వ నగరం(City of Equality)గా మారిపోయింది. అహింసా సిద్ధాంతంతో శాంతిస్థాపనకు కృషి చేసిన గౌతమబుద్ధుడి విగ్రహం ఒకవైపు, సమ సమాజం కోసం తపించిన రామానుజాచార్యుల విగ్రహం మరోవైపు హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. ఇప్పుడు నవసమాజం కోసం ఆచరణ సిద్ధాంతాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ విగ్రహం కూడా భాగ్యనగరానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చింది.

తెలుగువారి వారసత్వ నగరం హైదరాబాద్ మరో అరుదైన ఘనతను సాధించింది. భాగ్యనగరం నుంచి విశ్వనగరంగా మారిన హైదరాబాద్… సైబరాబాద్‌ ఐటీ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది. ఇప్పుడు
సమానత్వ ప్రతీకగా మారి సిటీ ఆఫ్ ఈక్వాలిటీగా నిలుస్తోంది. ప్రపంచంలో శాంతి, సమానత్వం కోసం కృషి చేసిన ముగ్గురు మహానుభావుల విగ్రహాలకు వేదికగా మారింది హైదరాబాద్. గౌతమ బుద్ధుడు, రామానుజాచార్యులు, అంబేద్కర్ (Ambedkar) ఈ ముగ్గురు మహానీయులు వారి జీవిత కాలంలో శాంతి, సమానత్వ సందేశాలతో యుగ పురుషులుగా నిలిచారు. యాధృచ్చికంగా ఈ ముగ్గురి విగ్రహాలు.. అందునా ప్రపంచ స్థాయిలోనే మేటిగా నిలిచిన విగ్రహాలకు హైదరాబాద్ చోటివ్వడం తెలుగు వారికి గర్వకారణంగా మారింది.

హైదరాబాద్ అంటే చార్మినార్(charminar), హుస్సేన్‌సాగరే గుర్తుకొస్తాయి.. అంతర్జాతీయంగా చార్మినార్‌కు గుర్తింపు ఉంది. చార్మినార్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ఖ్యాతి హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహానికే చెందుతుంది. 1985లో హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుని విగ్రహానికి శంకుస్థాపన చేసి గొప్ప చారిత్రక వైభవానికి శ్రీకారం చుట్టారు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఉమ్మడి ఏపీలో 1983లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా, అక్కడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూశారు. అలాంటి విగ్రహం మన రాష్ట్రంలో కూడా ఉండాలని భావించి బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు.

అమెరికా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం స్వేచ్ఛా స్వతంత్రాలకు ప్రతీక. మరి హైదరాబాద్‌లో ఎవరి విగ్రహం పెట్టాలనే విషయంపై తీవ్రంగా ఆలోచించిన ఎన్టీఆర్(NTR).. సిద్ధార్థుడిని ఎంచుకున్నారు. అహింసా సిద్ధాంతం.. సమ సమాజం కోసం రాజ్యాన్నే త్యజించిన యుగ పురుషుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా.. హైదరాబాద్ అందరి నగరంగా తీర్చిదిద్దాలని భావించిన ఎన్టీఆర్ 1985లో శంకుస్థాపన చేశారు. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) నడి మధ్యలో 15 అడుగుల ఎత్తులో పీఠం ఏర్పాటు చేసి.. 58 అడుగుల బుద్ధుడి విగ్రహం పెట్టాలని నిర్ణయించారు. అంతేకాదు ఆ విగ్రహానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకురావాలని భావించి.. ఏకశిలా విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం నేటి భువనగిరి జిల్లాలో తెల్లని గ్రానైట్ కొండను గుర్తించి ఏక శిలా విగ్రహాం చెక్కించారు.

ప్రపంచంలో ఎత్తైన ఏక శిలా బుద్ధుడి విగ్రహం హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. సుమారు రెండేళ్లు చెక్కిన బుద్ధుడి విగ్రహం(Buddha Statue) హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా రోడ్లు వేశారు. అప్పట్లో ఇరుకుగా ఉండే రోడ్లు బుద్ధుడి ఆగమనంతో విశాలంగా మారాయి. ప్రత్యేక వాహనాలతో హైదరాబాద్ తీసుకువచ్చిన బుద్ధుడి విగ్రహాన్ని 1992లో హుస్సేన్‌సాగర్‌లో పీఠంపై అమర్చారు. ఆ తర్వాత 2006లో దలైలామా హైదరాబాద్ పర్యటన సందర్భంగా బౌద్ధ సంప్రదాయ ప్రకారం బుద్ధుని విగ్రహాన్ని ప్రారంభించారు.

Also Read: దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.. ఎన్నో ప్రత్యేకలు.. మహనీయుని జీవిత విశేషాలు తెలిపేలా అరుదైన చిత్రాలు

ఈ విధంగా బుద్ధుడి బొమ్మను అక్కున చేర్చుకున్న హైదరాబాద్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2022లో సమతామూర్తి విగ్రహం (Statue of Equality )ఆవిష్కరణతో మరో అరుదైన ఘనతను సాధించింది భాగ్యనగరం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ (Muchintal)లో ఏర్పాటు చేసిన సమాతామూర్తి విగ్రహం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. దేశంలోని 108 ప్రముఖ దివ్య దేవాలయాల ప్రతిరూపంగా నిలుస్తోంది.

ఇప్పుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణతో మరో సమతా సారథి హైదరాబాద్ గడ్డపై ఠీవిగా నిల్చొని విశ్వ సందేశం ఇస్తున్న నగరంగా కీర్తి గడించింది భాగ్యనగరం. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. మన రాజ్యాంగ నిర్మాతకు హైదరాబాద్ నగరం నుంచే తొలి డాక్టరేట్ అందింది. ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా భారీ విగ్రహం కూడా హైదరాబాదే వేదిక కావడంతో తెలంగాణ వైభవం దేశం నలుమూలలా విస్తరించినట్లైంది.