మీ సేవలకు ఫిదా: గిఫ్టుగా బంగారం, వజ్రాలు పంపిస్తున్నానంటూ లక్షలు దోచేసాడు

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 02:46 PM IST
మీ సేవలకు ఫిదా: గిఫ్టుగా బంగారం, వజ్రాలు పంపిస్తున్నానంటూ లక్షలు దోచేసాడు

Hyderabad : సైబర్ క్రైమ్ దోపిడీలకుఅడ్డాగా మారింది. సోషల్ మీడియాతో పరిచయాలు..పలకరింపులు..ఆపై స్నేహం, తరువాత చాటింగ్ లు..ఆ తరువాత ఇంకేముంది? అందిన కాడికి దోచేసుకోవటం..ఇదీ పరిస్థితి. మోసపోయామని గుర్తించేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఆతరువాత నెత్తీ నోరు కొట్టుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు.పోయిన పైసా కూడా తిరిగి రాదు.


ఫేస్‌బుక్‌ లో ఫ్రెండ్స్ అంటూ మొదలై..మోసంతో ఎండ్ అవుతుంది. ఇలాంటి మోసాలకు బలైపోయేది ఎంతోమంది. అటువంటి మరో దోపిడీ గుట్టు బైటపెట్టారు సైబారాబాద్ పోలీసులు. స్నేహంపేరుతో నమ్మించటం..గిఫ్ట్‌ల పేరుతో బురిడీకొట్టించి అడ్డంగా దోచేస్తున్న నైజీరియన్‌ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.


సైబర్‌ క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపిన వివరాల ప్రకారంగా చూస్తే..హైదరాబాద్ లోని పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఒక సొసైటీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.సొసైటీ తరఫున మహిళా సాధికారతకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సాధికారత దిశగా పయనించేవారికి సపోర్ట్ గా నిలుస్తుంటారు. ఆమెకు గత సెప్టెంబర్ 28న ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.


జర్మనీ డాక్టర్ నంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్
నేను జర్మనీలో ఉంటాను. నా పేరు జేమ్స్‌ డోనాల్డ్‌ అని చెప్పాడు. డాక్టర్ గా ఫుడ్ బిజీగా ఉంటానని చెప్పి..ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ రిక్వెస్ట్ ను ఆమె ఏక్సప్ చేసింది. అలా ఇద్దరూ నెలలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అన్ని విషయాలు మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకునేవారు. ఆమె తను చేసే కార్యక్రమాల గురించి చెప్పింది. దీంతో మోసం చేయటానికి ఓ కీలక విషయం దొరికిందనుకున్నాడు.


మీరు సో గ్రేట్ అంటూ పొడగ్తలు..చాటింగ్ లు 
ఆమె చేసే పనులు చాలా గొప్పవనీ..మీలాంటివారు నాకు ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందనీ తెగ మెచ్చుకునేవాడు. మిమ్మల్ని చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. నా వంతు సాయంగా ఏదో ఒకటి చేస్తానంటూ నమ్మించేవాడు. ఫోన్‌ నంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకోవటంతో ఇద్దరూ ఫోన్ లో తరచూ మాట్లాడుకునేవారు.

గిఫ్ట్‌పేరుతో టోకరా ఇచ్చిన ఫేస్ బుక్ ఫ్రెండ్..
అలా కొన్ని రోజులు గడిచాక నెమ్మదిగా తన ప్లాన్ అమలు చేద్దామని ఫిక్స్ అయ్యాడు సదరు జర్మనీ డాక్టర్ ని అని చెప్పుకునే ఫేస్ బుక్ ఫ్రెండ్. ఆమె తనను తన మాటల్నీ పూర్తిగా నమ్మిందని నిర్ధారణ అయ్యాక..అసలు విషయానికి తెరతీశాడు. ‘‘మీరు చేస్తున్న సేవ నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్‌ చేసింది. నా వంతుగా సహాయం చేస్తానంటూ మీకో గిఫ్ట్ బాక్స్ పార్శిల్ పంపిస్తున్నాను..’’ అని నమ్మించాడు. ఆ బాక్సులో రూ. కోట్ల విలువైన జర్మన్‌ పౌండ్స్‌తో పాటు..బంగారం, వజ్రాల నగలు ఉన్నాయని..ఆ బాక్సుని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి పంపిస్తున్నానని నమ్మించాడు.


ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 370 పౌండ్స్‌ (రూ. 35000) కస్టమ్స్‌ డ్యూటీ చెల్లిస్తే ఆ పార్శిల్‌ మీకు అందజేస్తారని నమ్మించాడు. ఫ్రెండ్ అని ఫిక్స్ అయిందికాబట్టి అతను చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం అనుమానం కలగలేదు. పైగా తను చేసే కార్యక్రమాలను అడిగి తెలుసుకోవటం..మెచ్చుకోవటం..తెగ పొగిడేస్తుండటంతో పూర్తిగా నమ్మేసింది.


అలా నాలుగు రోజుల తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులం మాట్లాడుతున్నాం అంటూ.. ఆమెకు ఫోన్‌ వచ్చింది. ‘మీ పేరున జర్మనీ నుంచి ఒక గిఫ్ట్‌ పార్శిల్‌ వచ్చింది. కస్టమ్స్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, లాయర్‌ ఫీజ్‌, ఇన్సూరెన్స్‌ వంటి పలు చార్జీలు చెల్లించాలి.’ అని కొంత ఎమంట్ బ్యాంకులో వేయాలని చెప్పారు. బాక్స్ వెయిట్ ను బట్టి మరింత చార్జీలు అవుతాయని మరికొంత ఎమంట్ పంపించాలని చెబుతూ అలా విడతలవారీగా మొత్తం రూ. 16.74 లక్షలు దోచేశారు.


వాళ్లు అడిగిన డబ్బులు పంపించినాగానీ ఎంతకూ గిఫ్ట్‌ మాత్రం పంపించకపోవటంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఇదంతా మోసమని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆమె లబోదిబోమంటూ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా ఇదంతా నైజీరియన్‌ల ముఠా చేసిన మోసంగా తమ దర్యాప్తులో గుర్తించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేశారు.



ఢిల్లీ కేంద్రంగా నైజీరియన్ల ముఠా సైబర్ నేరాలు..ఢిల్లీ వెళ్లిన పోలీసులు బృందం

ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలటంతో సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ విజయ్‌వర్థన్‌ల బృందం ఢిల్లీకి వెళ్లింది. జేమ్స్‌ డోనాల్డ్‌ పేరుతో మహిళను బురిడీ కొట్టించిన నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు వీఐపీ అలియాస్‌ ఒనేకా ఇజికితో పాటు, నాన్‌సోచీఫ్‌ కెల్విన్‌, మేఖేష్‌ శర్మ, సిరాజుద్దీన్‌ రైన్‌, సుభాస్‌ సింగ్‌, అవినాశ్‌పాండేలను గుర్తించారు. వారిలో నాన్‌సోచీఫ్‌ కెల్విన్‌, సిరాజుద్దీన్‌ రైన్‌, సుభాస్‌ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.