Hyderabadis: జొమాటో డెలివరీ బాయ్‌కి కస్టమర్ గిఫ్ట్.. మానవత్వం అంటే ఇదే!

పేదరికంతో నిండిన కుటుంబాల్లో ఎంతోమంది కుటుంబానికి అండగా నిలిచేందుకు.. వానలో తడిసిపోతూ, ఎండలో మాడిపోతూ.. వీధుల్లో నిలబడి ఉన్న నీటిని దాటుకుంటూ.. అనేక ఇబ్బందుల మధ్య ఆహారాన్ని అందజేస్తూ ఉంటారు ఫుడ్ డెలివరీ బాయ్స్.

Hyderabadis: జొమాటో డెలివరీ బాయ్‌కి కస్టమర్ గిఫ్ట్.. మానవత్వం అంటే ఇదే!

Zomato delivery Boy

Zomato delivery Boy: పేదరికంతో నిండిన కుటుంబాల్లో ఎంతోమంది కుటుంబానికి అండగా నిలిచేందుకు.. వానలో తడిసిపోతూ, ఎండలో మాడిపోతూ.. వీధుల్లో నిలబడి ఉన్న నీటిని దాటుకుంటూ.. అనేక ఇబ్బందుల మధ్య ఆహారాన్ని అందజేస్తూ ఉంటారు ఫుడ్ డెలివరీ బాయ్స్. ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా మంది ఫుడ్ డెలివరీ కోసం సైకిళ్లను కూడా ఉపయోగిస్తున్నారు. అటువంటివారిని మనం చూస్తూనే ఉంటాం.

హైదరాబాద్ నగరంలో అతికష్టమ్మీద సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్న ఓ జొమాటో డెలివరీ బాయ్‌కి అండగా నిలిచారు కొందరు యువకులు. పేదరికంతో బైక్‌ లేక సైకిల్‌పై ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేస్తున్న జొమాటో బాయ్‌కి కస్టమర్‌ రూపంలో ఆపన్నహస్తం అందింది. జూన్‌ 14వ తేదీన హైదరాబాద్‌లోని కింగ్‌కోఠికి చెందిన రాబిన్‌ ముకేష్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్‌ చేశాడు.

ఆ ఆర్డర్‌ను పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఆకీల్‌(21) లక్డీకాపూల్‌ నుంచి పార్సిల్‌ తీసుకుని 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్‌కోఠిలో ఇచ్చేందుకు వెళ్లాడు. పార్సిల్‌ తీసుకోవడానికి కిందకు వచ్చిన రాబిన్‌ ముకేష్.. ఆకీల్‌ను చూసి, ఆకీల్ ఫుడ్ డెలివరీ చేసేది ఒక సైకిల్‌పై అని తెలుసుకుని చలించిపోయాడు.

రాబిన్‌ వెంటనే ఈ విషయాన్ని 32 వేల మంది సభ్యులు ఉన్న ‘ది గ్రేట్‌ హైదరాబాద్‌ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌’ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశాడు. దీంతో రెండు రోజుల్లోనే రూ. 73వేలు పోగవ్వగా.. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాన్ని రూ.65వేల 800తో కొనుగోలు చేసి ఆకీల్‌కి అందించారు. అందరిలా మాములుగా ఉండకుండా ముఖేష్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. మానవత్వం అంటే ఇదేననంటున్నారు.

పేద కుటుంబంలో పుట్టిన ఆకీల్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. తండ్రి సంపాదన అంతత మాత్రమే కాగా.. బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతూ డెలివరీ బాయ్‌గా చేరాడు. జొమాటో వారికి తన పరిస్థితి వివరించి ఫుడ్‌ను సైకిల్‌పై డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ కష్టమర్ రూపంలో ఆకీల్‌కి గిఫ్ట్ అందింది.