Liqour Shops : పండుగ వేళ మందుబాబులకు షాక్.. బార్లు, వైన్ షాపులు బంద్.. గుంపులుగా తిరగొద్దని వార్నింగ్

రంగుల పండుగ హోలీ.. సందర్భంగా మందుబాబులకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. గీత దాటితే తాట తీస్తామని హెచ్చరించారు..

Liqour Shops : పండుగ వేళ మందుబాబులకు షాక్.. బార్లు, వైన్ షాపులు బంద్.. గుంపులుగా తిరగొద్దని వార్నింగ్

Close Liquor Shops : రంగుల పండుగ హోలీ.. సందర్భంగా మందుబాబులకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి.. మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకూ హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలంటూ గురువారం(మార్చి 25,2021) హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు పండుగ పూట ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం, బలవంతంగా రంగులు చల్లడం వంటి చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు.

మరో నాలుగు రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది. హోలీ నాడు రంగులతో ఆటలే కాకుండా ఫుల్‌గా తాగి రోడ్లపై తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటారు. వీరి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వీటన్నింటికి చెక్‌ పెట్టడానికి హైదరాబాద్‌ పోలీసులు నడుం బిగించారు. రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా జంట నగరాల్లో ఈసారి కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వైన్ షాపులు క్లోజ్ చేయిస్తున్నారు.

హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గీత దాటితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.