సెకండ్ ఇన్నింగ్స్‌లో సురేశ్ రెడ్డి.. కవిత ఎంటరైతే డౌటే

సెకండ్ ఇన్నింగ్స్‌లో సురేశ్ రెడ్డి.. కవిత ఎంటరైతే డౌటే

మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డికి పదవీ విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. త్వరలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో ఈ చర్చ రాజకీయ వర్గాలలో ప్రధానంగా కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అగ్రనాయకులలో ఒకరిగా ఉన్న సురేశ్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో దిగే సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి అందరినీ విస్మయానికి గురి చేశారు. 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైన తర్వాత పార్టీ మారినందున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరని తేలిపోయింది. పార్టీలో చేరే సమయంలోనే పదవిపై స్పష్టమైన హామీ లభించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సముచిత స్థానం కల్పిస్తామని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. 

2018 డిసెంబర్‌లో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సందర్భంలో సురేశ్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సురేశ్‌రెడ్డి సభాపతిగా పని చేసినందున దానికి అనుగుణంగా సముచిత స్థానం ఇవ్వా ల్సి ఉంటుంది. సభాపతిగా పని చేసినందున మండలి చైర్మన్‌ ఇస్తారని ప్రచారం జరిగింది. మండలి చైర్మన్‌ చేయాలంటే ఎమ్మెల్సీని చేయాలి. సభాపతిగా జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారిస్తున్నందున సురేశ్‌రెడ్డికి అవకాశం రాలేదు. ఒకే జిల్లాకు సభాపతి, మండలి చైర్మన్‌ పదవులు ఉండడం సరికాదనే ఉద్దేశంతో వేరే జిల్లాకు అవకాశమిచ్చారని అంటారు.

బాల్కొండ నియోజకవర్గం నుంచి సురేశ్‌రెడ్డి నాలుగు సార్లు వరుసగా విజయం సాధించారు. 1989 నుంచి 2004 వరకూ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఆర్మూర్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2004 ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా వివాదరహితుడిగా, మితభాషిగా, విలువలు కలిగిన రాజకీయనేతగా పేరుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులలో, పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదు. ఒక రకంగా ఏడాది కాలంగా రెండు ని యోజకవర్గాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. పదవీ కాలం ఏడాది మాత్రమే ఉంది. స్థానిక సంస్థలలో టీఆర్‌ఎస్‌కే మెజారిటీ ఉంది. ఏడాది కాలానికి బరిలో దిగినప్పటికీ మళ్లీ ఏడాది తర్వాత అవకాశం రానుంది. ఓటర్లు ఇప్పుడున్న వారే ఏడాది తర్వాత కూడా ఉంటారు. రెండు అవకాశలున్నందున ఏదైనా ఒకటి దక్కుతుందని సురేశ్‌రెడ్డి అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. ఈ రెండూ మిస్సయితే మరికొంత కాలం ఆగాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు వస్తున్నందున ఈసారైనా అవకాశం వస్తుందా అని ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారట. 

రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ కూడా వెలువడింది. ఎమ్మెల్యేల బలం దృష్ట్యా రెండూ టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశముంది. మార్చి 6న నోటిఫికేషన్‌ జారీ కానుంది. 13 వరకు నామినేషన్‌లు దాఖలు చేస్తారు. వివిధ సమీకరణాల ఆధారంగా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. సురేశ్‌రెడ్డి మాదిరే ఇతరులకు కూడా అధిష్ఠానం హామీ ఇచ్చింది. గత ఏడాద పార్లమెంట్‌ ఎన్నికల్లో టికెట్లు పొందని సిట్టింగ్‌లు సైతం రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత పేరు తెర మీదకు వచ్చింది. 

ఒకవేళ కవితకు ఒక అభ్యర్ధిత్వం ఖరారైతే సురేశ్‌రెడ్డికి రావడం అనుమానమే. ఒకే జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఒకవేళ రాజ్యసభ మిస్సయితే ఎమ్మెల్సీ పదవికి సురేష్‌రెడ్డి పేరును పరిశీలించే అవకాశముందని అంటున్నారు. కానీ ఎమ్మెల్సీ పదవిని సురేశ్‌రెడ్డి ఆశించడం లేదని అనుచరులు చెబుతున్నారు. తన స్థాయికి తగ్గ సరైన పదవి కోసం ఆయన ఎదురు చూస్తున్నారట. రాజ్యసభ అయితేనే తన స్థాయికి అతికినట్టు సరిపోతుందని సురేశ్‌రెడ్డి భావిస్తున్నారట. మరి టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎదురు చూడాల్సిందే.