No Mask Fine : తెలంగాణలో మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా

మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం (ఏప్రిల్ 11, 2021) ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

No Mask Fine : తెలంగాణలో మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా

If You Do Not Wear A Mask In Telangana You Will Be Fined Rs 1000

no mask fined Rs.1000 : తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజుకురోజుకూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం (ఏప్రిల్ 11, 2021) ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రాంతాలు, ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వైరస్ ఉధృతి రోజురోజుకి పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 3వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న(ఏప్రిల్ 10,2021) రాత్రి 8గంటల వరకు 1,15,311 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 3వేల 187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు.

రాష్ట్రంలో నిన్న కరోనాతో మరో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,759కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 787 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,05,335కి చేరింది. ప్రస్తుతం 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 13,366 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 551 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం(ఏప్రిల్ 11,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.