10 రోజులు ప‌ని చేస్తే 10 రోజులు సెల‌వు

  • Published By: bheemraj ,Published On : June 24, 2020 / 06:18 PM IST
10 రోజులు ప‌ని చేస్తే 10 రోజులు సెల‌వు

కరోనా వైరస్ ను ఎదుర్కొనే క్ర‌మంలో వైద్య‌ సిబ్బంది క‌రోనా బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీన్ని నివారించేందుకుగానూ కరోనా కేర్ వ‌ర్క‌ర్ల కోసం కేర‌ళ ప్ర‌భుత్వం త్రీ టైర్ పూల్ విధానాన్ని తీసుకురానుంది. ఈ కొత్త‌ నిర్ణ‌యం ప్ర‌కారం సిబ్బందిని కరోనా పూల్‌, ఆఫ్ డ్యూటీ పూల్‌, రొటీన్ పూల్ అని మూడు ర‌కాలుగా విభ‌జిస్తారు. కరోనా పూల్‌లో ప‌ని చేసిన వారు త‌ర్వాత ఆఫ్ డ్యూటీ పూల్ కింద ప‌ని చేస్తారు. 

అనంత‌రం రొటీన్ పూల్‌లోకి వెళ్తారు. ఆ త‌ర్వాత తిరిగి కరోనా పూల్‌లో ప‌ని చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌ నిరంత‌రం కొన‌సాగుతూ ఉంటుంది. ఈ  కొత్త విధానం ప‌రిధిలోకి వైద్యులు, న‌ర్సులు, ఫార్మ‌సిస్టులు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, న‌ర్సింగ్ అసిస్టెంట్లు, ఆసుప‌త్రి అటెండెంట్లు, డ్రైవ‌ర్లు ఇత‌రులు వ‌స్తారు.

కరోనా కేర్ విభాగం కింద వ‌చ్చేవారు ప‌ది రోజులు ప‌ని చేస్తే ఆ త‌ర్వాతి 10 రోజులు సెల‌వు తీసుకోవాలి. వీరు రోజుకు మూడు షిఫ్టుల్లో ప‌ని చేయాల్సి ఉంటుంది. ఎనిమిది గంట‌ల షిఫ్టులో నాలుగు గంట‌లు ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్ష‌న్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ కిట్) ధ‌రించి, మ‌రో 4 గంట‌లు పీపీఈ కిట్ లేకుండా ప‌ని చేయాలి. వీరి ఆరోగ్య ప‌రిస్థితి కూడా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల్సి ఉంటుంది. 

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే అధికారుల‌కు తెలియ‌జేయాలి. ఇందుకోసం “ఎమ‌ర్జెన్సీ రిలీవ‌ర్స్ టీమ్” కూడా ఉంటుంది. ఇందులో 15 మంది సిబ్బంది ఉంటారు. డ్యూటీ ముగిసిన త‌ర్వాత హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు ఆసుప‌త్రిలోనే స్నానం చేయాలి.