కరోనా దందాలు : ప్రైవేట్ ల్యాబ్ తో డీల్స్..బాధితుల సాంపిల్స్ సేకరించి డబ్బులు వసూళ్లు

  • Published By: nagamani ,Published On : July 14, 2020 / 09:55 AM IST
కరోనా దందాలు : ప్రైవేట్ ల్యాబ్ తో డీల్స్..బాధితుల సాంపిల్స్ సేకరించి డబ్బులు వసూళ్లు

కరోనాను అడ్డపెట్టుకుని దందాలు చేసే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనాపరీక్షల్లో డబ్బులు వసూళ్లు..అక్రమంగా సాంపిల్స్ సేకరించి డబ్బులు దండుకుంటున్న ఘటనలు సర్వసాధారణమైపోయాయి. జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కరోనా దందాలు చేస్తున్నాడు.తన సొంత క్లినిక్‌లో రాత్రి సమయాల్లో కరోనా లక్షణాలున్న వారి నుంచి శాంపిళ్లను సేకరిస్తు..వాటిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తు ఒక్కో పరీక్షకు రూ. 3,500 వసూలు చేస్తున్న వైనం బైటపడింది.

అలాగే వరంగల్ ల్లో కూడా ఓ ప్రభుత్వ డాక్టర్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌తో డీల్ కుదుర్చుకుని..తన సొంత నర్సింగ్‌ హోంలో కరోనా శాంపిళ్లను సేకరించి ఈ ల్యాబ్ కు పంపిస్తూ..కరోనా లక్షణాలు ఉన్నవారి నుంచి రూ. 3 నుంచి 4 వేలు వసూలు చేస్తున్నాడు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈక్రమంలో జనగాం జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ తన క్లినిక్‌కు వచ్చే వారిలో కరోనా లక్షణాలున్న వారిని రాత్రి సమయంలో రమ్మని వారి నుంచి శాంపిళ్లను సేకరించి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ల్యాబ్ కు పంపించి..తరువాత 3 రోజుల్లో పాజిటివ్‌ వచ్చిందంటూ రిపోర్టు ఇస్తున్నాడు. ఆ తరువాత కూడా ఆ డాక్టరే అతనికి ట్రీట్ మెంట్ చేస్తున్నాడు.

రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్‌లోని కొన్ని ఆసుపత్రులు, లేబోరేటరీల్లో మాత్రమే కరోనా శాంపిళ్లు సేకరించాలి. పర్మిషన్స్ ఉన్నచోట మాత్రమే టెస్ట్ లు చేసే వెసులుబాటుంది. కానీ ఇంత కఠిన నిబంధలను ఉన్నాగానీ..ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం నిర్లక్ష్యమే నంటున్నారు ప్రజలు.

ఐసీఎంఆర్‌ అనుమతి పొంది..పేరున్న ప్రైవేట్‌ లేబరేటరీలు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే సక్రమంగా శాంపిళ్ల సేకరణ..పరీక్షలు జరగడంలేదంటూ ఐసీఎంఆర్‌ గుర్తించడం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. వాటిల్లో 12 లేబరేటరీలకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీచేసింది. అంటే మోసాలు ఏ రేంజ్ లోజరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. దీనికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందోమాత్రం తెలియదు.

అడ్రస్‌లేని క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలలో కరోనా లక్షణాలున్న వారినుంచి శాంపిళ్లను సేకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వానికి ఏమీ పట్టటం లేదనే విమర్శలుకూడా వస్తున్నాయి. పైగా ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం ఒక పరీక్షకు రూ. 2,200 మాత్రమే తీసుకోవాలి. కానీ జనగాం క్లినిక్‌లో ఏకంగా రూ. 3,500 తీసుకోవడం గమనించాల్సిన విషయం. కరోనాతో నానా కష్టాలు పడుతున్న క్రమంలో ఇటువంటి దందాలు చేస్తూ ప్రజలనుంచి అన్యాయంగా డబ్బులు దండుకుంటున్న ఇటువంటి ఘరానా మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.