ముందు అప్పు ఇస్తారు, ఆ తర్వాత ఆస్తులు లాక్కుంటారు.. కోల్‌బెల్ట్‌లో అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారుల దందా

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 12:11 PM IST
ముందు అప్పు ఇస్తారు, ఆ తర్వాత ఆస్తులు లాక్కుంటారు.. కోల్‌బెల్ట్‌లో అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారుల దందా

illegal finance business in coal belt: అక్కడ అప్పు పుడితే అంతే సంగతులు.. ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకుంటారు. వడ్డీ మీద వడ్డీ వేస్తూ.. చక్రవడ్డీ.. బారువడ్డీలంటూ వేధిస్తారు.. అప్పు తిరిగివ్వకపోతే ఆస్తులు జప్తు చేస్తారు.. అప్పు తీర్చినా లెక్క తేల లేదంటూ దొంగ లెక్కలు చూపిస్తూ.. ఇచ్చిందానికి రెట్టింపు వసూలు చేస్తారు.. కోల్ బెల్ట్ వ్యాప్తంగా సాగుతోన్న ఫైనాన్స్ దందా పై 10టివి ప్రత్యేక కథనం….




ప్రజల అవసరాలే వారి పెట్టుబడి:
పైకి అప్పు ఇస్తాం రమ్మంటారు.. ఆస్తులన్నీ తాకట్టు పెట్టించుకుంటారు.. తిరిగివ్వడం కాస్త ఆలస్యమైనా నర రూప రాక్షసుల్లా మారిపోతారు. డబ్బులు తిరిగిచ్చేదాకా వెంటపడి వేధిస్తూ బాధితులకు నరకం చూపుతారు. వడ్డీపై వడ్డీ వసూలు చేస్తూ ప్రజల రక్తం తాగుతున్నారు అక్రమ ఫైనాన్స్ వ్యాపారులు. ప్రజల అవసరాలనే పెట్టుబడిగా మార్చుకొని.. దందాకు తెర లేపారు. వడ్డీల పేరుతో జనాలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. సింగరేణి విస్తరించి ఉన్న కోల్‌ బెల్ట్‌ ప్రాంతంలో ఈ అక్రమ దందా జోరుగా సాగుతోంది.

అప్పు కోసం ఆస్తులు, నగదు, వాహనాలు.. కార్మికులైతే ఏటీఎమ్‌, బ్యాంకు పాస్‌బుక్‌లు.. రైతులైతే భూముల పత్రాలు:
సింగరేణి కార్మికులు, రైతుల కుటుంబాలకు ఇక్కడ అధిక వడ్డీకే అప్పు పుడుతుంది. ఆస్తి లేకపోతే నగలు, వాహనాలు పెట్టి అప్పు తెచ్చుకుంటారు.. కార్మికులు తమ ATM, బ్యాంకు పాస్‌ బుక్‌లు తాకట్టు పెడితే .. రైతులు వారి భూముల పత్రాలు ఇస్తారు. 10 పర్సంట్‌ వడ్డీకి అప్పు ఇస్తారు ఫైనాన్సర్లు. ఏదో ఒక అవసరం కోసం తీసుకున్న అప్పు.. వారి పాలిట శాపంగా మారుతోంది.. టైమ్‌కు గాని డబ్బు తిరిగివ్వకపోతే వడ్డీ పెంచేసి.. లెక్కలు మార్చేస్తారు ఫైనాన్సర్లు. తాము చెప్పిన లెక్క ప్రకారం డబ్బు తిరిగిచ్చే వరకూ నరకం చూపిస్తారు. ఈ వేధింపులు తాళలేక కరీంనగర్‌లో రామకృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అనుమతుల్లేకుండానే వడ్డీ వ్యాపారం.. టైమ్‌కు డబ్బులివ్వకపోతే ఆస్తులు జప్తు:
ఎలాంటి అనుమతుల్లేకుండానే వడ్డీ వ్యాపారం చేస్తున్నారీ కేటుగాళ్లు. డబ్బు అవసరం ఉన్న వ్యక్తులను నేరుగా కాంటాక్ట్ అయి అప్పులిస్తారు. అప్పు ఇచ్చే సమయంలో ప్రామిసరీ నోట్‌తో పాటు.. చెక్‌ బుక్‌, ప్రాపర్టీ పేపర్లు, నగలు, బైక్‌ ఇలా ఏది ఉంటే అది ఇవ్వాల్సిందే.. లేదంటే అప్పు పుట్టదు.. ఒకవేళ డబ్బు సమయానికి చెల్లించకపోతే.. తాకట్టు పెట్టిన ఆస్తుల్ని జప్తు చేస్తారు. ప్రాపర్టీ విలువ ఎక్కువ ఉన్నా సరే.. వారికిష్టం వచ్చినంతే చెల్లిస్తామని బాధితులను వేధిస్తున్నారు.
https://10tv.in/coronavirus-chinese-citizen-journalist-faces-jail/
అక్రమ ఫైనాన్స్ వ్యాపారంపై పోలీసులు ఫోకస్:
రామగుండం, గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి ఏరియాల్లో ఈ అక్రమ దందా జోరుగా సాగుతోంది. అధిక వడ్డీలతో ప్రజల్ని పట్టి పీడిస్తున్న అక్రమ ఫైనాన్స్ వ్యాపారంపై పోలీసులు ఫోకస్ చేశారు. అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న ఫైనాన్స్‌లపై 15 ప్రత్యేక బృందాలు దాడులు మొదలు పెట్టాయి. ఇటీవల రామగుండం కమిషనరేట్ పరిధిలో 9 మంది ఫైనాన్సర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 12లక్షల నగదు, 283- బ్లాంక్ చెక్ లు, 198 బ్లాంక్ ప్రామిసరీ నోట్స్, 16 పాస్‌బుక్స్‌ , 45 ఏటీఎమ్‌ కార్డ్స్‌.., 488 కస్టమర్ లోన్ ఫైల్స్, 8 డైలీ రిజిస్టర్, బ్యాంకు స్టేట్‌మెంట్ ఫైల్స్, రిసిప్ట్ బుక్స్, కస్టమర్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నారు.




ఫైనాన్స్‌ దందాలో పలువురు రాజకీయనేతలు, పోలీసుల హస్తం:
అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో గతంలో నమోదైన 45 కేసుల్లో 78మంది వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్స్‌కు సంబంధించిన కేసులతో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. రెండో సారి పట్టుబడిన వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామంటున్నారు పోలీసులు. అయితే ఈ ఫైనాన్స్ దందా వెనుక రాజకీయ నాయకులతో పాటు… పలువురు పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెర వెనుక ఫైనాన్స్ దందా నడిపిస్తూ.. ఎలాంటి అడ్డంకులు రాకుండా సైలెంట్‌గా సెటిల్‌ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ తెర వెనుక ఉన్న పెద్దలపై పోలీసులు దృష్టి పెడితేనే … అక్రమ ఫైనాన్స్ దందాకు చెక్ పడుతుందంటున్నారు బాధితులు.