తప్పుడు ఫిర్యాదు, కట్టుకథలు అల్లితే ఏడేళ్ల జైలు శిక్ష !

తప్పుడు ఫిర్యాదు, కట్టుకథలు అల్లితే ఏడేళ్ల జైలు శిక్ష !

Imprisonment for a false complaint : ఇకనుంచి పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేస్తే, కట్టు కథలు చెబితే, హైడ్రామాలు సృష్టిస్తే జైలుకు వెళ్లక తప్పుదు. తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై సెక్షన్‌ 193 కింద పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టనున్నారు. ఇటీవలికాలంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో కలకలం రేపిన బీ.ఫార్మసీ విద్యార్థిని సృష్టించిన కిడ్నాప్‌, లైంగిక దాడి ఘటన పోలీసులతోపాటు ప్రజలను పరేషాన్‌ చేసింది. దీంతో ఇప్పుడు ఇలాంటి కట్టుకథలు అల్లే వారు, హైడ్రామాలు సృష్టించే వారిపై పోలీసులు సెక్షన్‌ 193లో అభియోగాలు మోపి చర్యలు తీసుకోనున్నారు.

బీ.ఫార్మసీ విద్యార్థిని అల్లిన కట్టుకథ ఎంతోమంది పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని.. ఇక ఇలాంటివి జరగకుండా ఉండేందుకు సెక్షన్‌ 193 కింద చర్యలు తీసుకోనున్నారు. ఈ విధంగా కట్టుకథలు సృష్టించే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో ఈ సెక్షన్‌ ద్వారా వివరించనున్నారు. దీని కోసం రాచకొండ పరిధిలో ఉన్న కళాశాలల విద్యార్థులకు అవగాహనను కల్పించనున్నారు.

అదే విధం గా ఇతరులు తప్పుడు ఫిర్యాదులతో అభద్రత భావం కల్పిస్తే… వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. తప్పడు ఫిర్యాదు, హైడ్రామా సృష్టికర్తలపై ఐపీసీ 193 కింద చర్యలు తీసుకునే అవకాశం పోలీసులకు ఉంది. అయితే తప్పుడు ఫిర్యాదును మూసివేసిన తర్వాత ఈ సెక్షన్‌ కింద తప్పుడు ఫిర్యాదు ఇచ్చే వారిపై కేసును నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్‌ అభియోగాలు రుజువైతే దాదాపు ఏడేళ్ల జైలు లేదా జరిమానా విధించనున్నారు.

కాబట్టి ఈ విధంగా కలవరం, కలకలం సృష్టించాలనే ఆలోచన ఉన్నవారు ఇక తస్మాత్‌ జాగ్రత్త. ఏదో పోలీసులను ఆటపట్టించి.. చివరికి సారీ అని చెప్పి సరిపెట్టుకుందామనుకుంటే కుదరదు. బీ.ఫార్మసీ విద్యార్థిని అల్లిన కట్టుకథ పోలీసులతో పాటు ప్రజలను ఒక్కసారిగా ఆందోళన కలిగించింది. మూడు రోజుల పాటు ఆ ఘటనపై విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రతి ఒక్కరూ కంగారుపడిన పరిస్థితి తెలిసిందే.

హైదరాబాద్‌లో ఇంత దారుణమా? అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్‌లతో అందరికీ భయం పుట్టుకుంది. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాచకొండ పోలీసులు సెక్షన్‌ 193పై అవగాహన కల్పించనున్నారు.