ఇంటర్ కాలేజీలు మూసేయడం లేదు.. వాయిదా వేసిన హైకోర్టు

ఇంటర్ కాలేజీలు మూసేయడం లేదు.. వాయిదా వేసిన హైకోర్టు

గుర్తింపులేని ఇంటర్ బోర్డు కాలేజీలు తీసుకునే చర్యలకు బ్రేకులు వేసింది హైకోర్టు. ఉన్నట్టుండి కాలేజీలను రద్దు చేస్తే.. విద్యార్థులు రోడ్డున పడతారని ఇంటర్ బోర్డు విఙ్ఞప్తిని మన్నించింది. పరీక్షలు ముగిసిన వెంటనే చర్యలు తీసుకోవడమే కాకుండా నివేదిక సమర్పించాల్సి ఉంటుందని కోర్టు ఆదేశాలిచ్చింది. 

రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది ఇంటర్‌ బోర్డ్‌. రిపోర్ట్‌లో కీలక అంశాలను పొందుపరిచింది. 68 ప్రైవేట్ కళాశాలలు గుర్తింపు లేకుండా నడుస్తున్నట్టు గుర్తించింది. మార్చి 4  నుంచి ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ఉండడంతో కాలేజీలను మూసేస్తే 30వేల మంది విద్యార్థులు పరిస్థితి అదోగతి అవుతుంది. పరీక్షలు అయిపోయాక చర్యలు తీసుకునేలా అనుమతి ఇవ్వాలని విఙ్ఞప్తి చేసింది.  

తెలంగాణలో 1084 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల 70 వేల 492 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని సౌకర్యాలు సరిగానే ఉన్నాయని నివేదికలో పేర్కొంది. 1476 ప్రైవేట్‌ కాలేజీల్లో 6 లక్షల 95 వేల 347 మంది విద్యార్థులు ఉన్నారు. గుర్తింపు లేకుండా నడుస్తున్న 68కాలేజీలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఇంటర్‌ బోర్డ్‌. మరోవైపు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేని కాలేజీలకు కూడా షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. 

ఇంటర్‌ బోర్డ్ అభ్యర్థనతో హైకోర్ట్ ధర్మాసనం ఏకీభవించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చర్యలకు బ్రేకులు వేసింది. అలాగే ఏప్రిల్ 3 వరకు కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సూచించింది. నాలుగేళ్లుగా గుర్తింపు లేకుండా నడుస్తున్న కాలేజీలు విద్యార్థుల నుంచి కోట్లరూపాయలు దండుకున్నాయి. హైకోర్ట్ ఆదేశాలతో ఈ దందా ఆగుతుందా.. మళ్లీ మరో రూట్‌లో వెళ్తారా అన్నది చూడాలి.