ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారం : ఏసీబీ దాడులతో కామారెడ్డి పోలీసు అధికారుల్లో టెన్షన్‌

  • Published By: bheemraj ,Published On : November 22, 2020 / 11:34 AM IST
ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారం : ఏసీబీ దాడులతో కామారెడ్డి పోలీసు అధికారుల్లో టెన్షన్‌

IPL betting affair : ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్‌ శాఖను కుదిపేస్తోంది. ఏసీబీ దాడులతో బెట్టింగ్‌ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీసు అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది.


ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ అవినీతి కేసును లోతుగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.



ఈ కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. డీఎస్పీ కార్యాలయాన్ని సీజ్ చేసిన అధికారులు లక్ష్మీనారాయణను అర్ధరాత్రి వరకూ విచారించారు.



డీఎస్పీతో పాటు మరో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు కూడా కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే జగదీశ్‌ ఇంట్లో రెండు రోజల పాటు సీఐ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ ఇవాళ కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.



క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో ఒకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు..కామారెడ్డి సీఐ జగదీశ్‌ 5 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో.. సీఐ జగదీశ్ అవినీతి బాగోతం బయటపడింది. సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. జగదీశ్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు… ఆయన నివాసంలో సోదాలు చేశారు.



నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో ఏడుగురు స‌భ్యుల అధికారుల బృందం సీఐ నివాసంలో సోదాలు నిర్వహించి రికార్డుల‌న్నింటినీ ప‌రిశీలించింది. రాష్ట్రంలో ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న జ‌గ‌దీశ్ బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేప‌ట్టింది.